Share News

అద్వితీయం

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:22 AM

ప్రజల వినతులను పరిష్కరించడంలో జిల్లా ముందంజలో నిలిచింది. రెవెన్యూ సమస్యలతో పాటు పీజీఆర్‌ఎస్‌ వినతులను పరిష్కరించడంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

అద్వితీయం
మీ కోసం కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

- పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో జిల్లాకు రెండో స్థానం

- రెవెన్యూ సమస్యలను క్లియర్‌ చేయడంలో బొబ్బిలి డివిజన్‌కు రెండో ర్యాంకు

- అధికారుల కృషి అభినందనీయమన్న కలెక్టర్‌

విజయనగరం,కలెక్టరేట్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల వినతులను పరిష్కరించడంలో జిల్లా ముందంజలో నిలిచింది. రెవెన్యూ సమస్యలతో పాటు పీజీఆర్‌ఎస్‌ వినతులను పరిష్కరించడంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ప్రీహోల్డ్‌ పట్టాల వెరిఫికేషన్‌ 99.49 శాతం పూర్తి చేయడంతో జిల్లాకు అగ్రస్థానం దక్కింది. కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశాలు, సూచనల మేరకు జేసీ సేతుమాధవన్‌ పర్యవేక్షణలో జిల్లా అధికారులు ప్రజా సమస్యలపై సత్వరం స్పందించడంతో జిల్లాకు మంచి గుర్తింపు లభించింది. ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమానికి వస్తున్న వినతులను పరిష్కరించడంలో జిల్లా, మండల, గ్రామ అధికారులు ప్రత్యేక చొరచూపించారు. కొన్ని జఠిల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగేవారు. గత ఏడాది జూన్‌ 15 నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 21,318 వినతులు వచ్చాయి. వీటిలో 18,882 (88.57శాతం) వినతులకు పరిష్కారం చూపించారు. తద్వారా రాష్ట్రంలో జిల్లాకు ద్వితీయ స్థానం వచ్చింది. రెవెన్యూ డివిజన్లకు సంబంధించి విజయనగరం 7, బొబ్బిలి 17, చీపురుపల్లి 26వ స్థానాల్లో నిలిచాయి. రెవెన్యూ సమస్యలపై గత ఏడాది డిసెంబరు 6 నుంచి ఇప్పటి వరకు 6,138 వినతులు వచ్చాయి. ఇందులో 5,726 (93.28 శాతం) వినతులకు పరిష్కారం చూపించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో జిల్లాలోని రెవెన్యూ డివిజన్లకు మంచి ర్యాంకులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 77 రెవెన్యూ డివిజన్లకు గాను 97.60 శాతం సమస్యలను పరిష్కరించి బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 93.23 శాతంతో చీపురుపల్లి 9వ స్థానం, 91.45 శాతంతో విజయనగరం 10 స్థానం సాధించాయి. అధికారులు చూపించిన చొరవతో జిల్లాకు చక్కని గుర్తింపు వచ్చింది.

చెరువు గర్భంలో ఆక్రమణల తొలగింపు

గత ఏడాది డిసెంబరులో ఎల్‌.కోట మండలం తామరాపల్లిలో రెవెన్యూ సదస్సు జరిగింది. గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 121-1లో ఉన్న రాతి చెరువు ఆక్రమణకు గురైనట్లు స్థానిక రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 4.42 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు చెప్పారు. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు గర్భంలో ఆక్రమణలు తొలగించారు. చెరువుకు హద్దులు నిర్ధారించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

భూ హక్కు పత్రాల పంపిణీ

బొండపల్లి మండలం గొట్లాం గ్రామ పరిధిలో ఐదుగురు రైతులు భూహక్కు పత్రాలు అందక పదేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు అనేకసార్లు మొర పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వారి సమస్యను అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఎస్‌.పార్వతి, వి.అప్పలరాజు, టి.మంగమ్మ, జే.సాంబమూర్తి, ఎల్‌.హైందవి అనే రైతులకు భూ హక్కు పత్రాలను అందజేశారు.

అర్జీదారుల సంతృప్తే ముఖ్యం

ప్రజల నుంచి వచ్చే వినతులను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలి. వచ్చిన ప్రతి వినతికి నాణ్యమైన పరిష్కారం చూపించాలి. సాధ్యమైనంత వరకూ రీ ఓపెన్‌ కాకుండా అర్జీదారుడిని సంతృప్తి పరచాలి. ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యను పూర్తిగా తెలుసుకుని, వారు శతశాతం సంతృప్తి చెందే విధంగా చూడాలి. సమస్యల పరిష్కారంలో ప్రస్తుత అధికారులు చూపిస్తున్న చొరవ అభినందనీయం. భవిష్యత్‌లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి.

-బీఆర్‌ అంబేడ్కర్‌, కలెక్టర్‌

Updated Date - Feb 13 , 2025 | 12:22 AM