Share News

snow worry మంచు గుబులు

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:12 AM

Two more months పూత దశలో ఉన్న మామిడి పంటకు పుట్టెడు కష్టాలు పొంచి ఉన్నాయి. దట్టంగా మంచు కురుస్తుండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. బాగా పూత పూసిందన్న ఆనందంలో రైతులు తెగుళ్లను ఏమరిస్తే పంటను నష్టపోవడం తప్పదని ఉద్యానశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

snow worry మంచు గుబులు

మంచు గుబులు

మామిడి పిందె రాలడం, కాయ సైజు తగ్గడంపై రైతుల్లో టెన్షన్‌

ముందుస్తు చర్యల్ని సూచిస్తున్న ఉద్యాన శాఖ

తొడుగులు వాడాలంటున్న అధికారులు

చీపురుపల్లి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పూత దశలో ఉన్న మామిడి పంటకు పుట్టెడు కష్టాలు పొంచి ఉన్నాయి. దట్టంగా మంచు కురుస్తుండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. బాగా పూత పూసిందన్న ఆనందంలో రైతులు తెగుళ్లను ఏమరిస్తే పంటను నష్టపోవడం తప్పదని ఉద్యానశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెగుళ్లను సకాలంలో నివారించకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పిందె రాలి పోవడం, కాయ సైజు తగ్గడం, పక్వ దశలో కాయలపై మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చునంటున్నారు. జిల్లాలో 30,834 హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉండగా కాపులో 28,500 హెక్టార్లు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. పూత దశ నుంచి పిందె వరకూ ఆశించే పలు చీడపీడల నివారణ కోసం ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తేనె మంచు పురుగు

ఇవి పూత, కాయ దశలో అధికంగా ఉంటాయి. గుంపులుగా చేరి అకులు, పుష్పగుచ్చాలు, పూలు, పిందెల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో పూత, పిందె రాలిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి పదార్థంపై నల్లని బూజులా ఏర్పడుతుంది. పురుగు నివారణకు వెంటనే ప్రొఫెనోపాస్‌ మందు 1.5 మిల్లీ లీటర్లు, లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వివిధ దశల్లో ఈ పురుగు నివారణకు సస్య రక్షణ చేపట్టాలి. నల్ల పూత దశలో పిందెలు బఠానీ గింజ నుంచి చింత గింజ సైజులో ఉంటాయి. రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ లేదా ఒక గ్రాము ఎసిఫేట్‌ను కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగు:

తామర పురుగులు రెండు మిల్లీమీటర్ల పొడవులో ఉంటాయి. ఇవి కొత్త చిగుళ్ల దశలో ఆకుల రసాన్ని పీల్చి వేస్తాయి. చిగురు ఆకులు పెరగక రాలిపోతాయి. మొగ్గ విచ్చుకొనే దశలో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పిందె దశలో ఉన్నప్పుడు 0.3 మిల్లీ లీటర్ల స్పైనోసాడ్‌ను లీటరు నీటిలో కలిపి స్ర్పే చేయాలి.

పిండి నల్లి

పిండి నల్లి తల్లి పురుగులు చెట్టు కింద మట్టిలో గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు గుడ్డు నుంచి బయటకు వచ్చిన వెంటనే కాండం మీదకు పాకుకుంటూ చెట్టు పైకి పోయి, లేత ఆకుల నుంచి, కాండం నుంచి, కాయ నుంచి, కాయ కాడ నుంచి, రసాన్ని పీలుస్తాయి. తేనె లాంటి జిగురు పదార్ధాన్ని విసర్జిస్తాయి. దానిపై మసి తెగులు వృద్ధి అవుతుంది. నివారణకు రెండు శాతం మిథైల్‌ పారాథియాన్‌ పొడి మందును మట్టిలో కలపాలి. ఇవి ఆశించిన కొమ్మలు, కాయలపై లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. ఆకు జల్లెడ గూడు పురుగు, మసిమంద, బూడిద తెగులు కూడా సోకే ప్రమాదం పొంచి ఉంది. నివారణకు వేర్వేరు ముందులను అధికారుల సూచనతో పిచికారీ చేయాలి.

తొడుగుల వల్ల చాలా ప్రయోజనం

మందులు పిచికారీ చేయడంతో పాటు కాయలకు తొడుగులు (ఫ్రూట్‌ కవర్‌) వాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒక్కో కవర్‌పై ఒక రూపాయి రాయితీ ఉంటుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా (5 ఎకరాల వరకూ) 20 వేల రూపాయలు రాయితీ లభిస్తుంది. అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- సీహెచ్‌ చంద్రశేఖరరావు, ఉద్యానశాఖ అధికారి, చీపురుపల్లి.

---------------------------------------------

Updated Date - Jan 30 , 2025 | 12:12 AM