మరో రెండు నెలలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:08 AM
Two more months ఫ్రీహోల్డ్ భూముల్లో రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో రెండు నెలల పాటు అమలు కానుంది. లోతుగా విచారించేందుకు గడువు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

మరో రెండు నెలలు
ఫ్రీహోల్డ్ భూముల్లో రిజిస్ర్టేషన్లపై కొనసాగనున్న విరామం
లోతుగా అధికారుల విచారణ
అన్ని కోణాల్లో ఆరా
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
ఫ్రీహోల్డ్ భూముల్లో రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో రెండు నెలల పాటు అమలు కానుంది. లోతుగా విచారించేందుకు గడువు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల భూములను బడాబాబులు స్వాధీనం చేసుకునే ఎత్తుగడ అమలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాలోనూ ఫ్రీహోల్డ్ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా ఆ భూముల రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని నెలాఖరులోగా సడలిస్తారని ప్రచారం నడిచింది. కానీ మరో రెండు నెలల పాటు రిజిస్ర్టేషన్ల నిలిపివేతను పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
విజయనగరం, జనవరి 29(ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ (డీపట్టా) భూములు ఎన్ని ఉన్నాయి? అందులో ఫ్రీహోల్డ్‌లో చేరినవి ఎన్ని? నిబంధనలు ప్రకారం ఎన్ని ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి? నోటిపై చేసినవి ఎన్ని, నోటిపై కాకుండా ఎన్ని చేశారు? అనేదానిపై పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించింది. ఈ నేపధ్యంలో వాటిపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ముందుగా విజయనగరం జిల్లాను ఎంచుకోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 45 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఫ్రీహోల్డ్‌లోకి వచ్చినవి 5,662.33 ఎకరాలుగా గుర్తించారు. ఇందులో 205 ఎకరాలకు సంబంధించి రిజిస్ర్టేషన్లు అయ్యాయి. వందలాది ఎకరాలకు సంబంధించి రిజిస్ర్టేషన్లు చేయించేందుకు సిద్ధపడుతుండగా కూటమి ప్రభుత్వం గుర్తించి నిలిపివేసింది. అప్పట్లో కొందరు వైసీపీ నేతలు తమ పరపతిని ఉపయోగించి ముందస్తు ఒప్పందాలతో కొన్ని భూములను ఫ్రీహోల్డ్‌లోకి మార్చినట్టు ఆరోపణలున్నాయి.
జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్డు నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు ఉన్నట్టు నాటి వైసీపీ పెద్దలు గుర్తించారు. వాటిని చేజెక్కించుకునేందుకు 2023 డిసెంబరు 19న ఆ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. అసైన్డ్ భూముల చట్టం 1977 ప్రకారం.. 20 ఏళ్లు గడువు దాటిన భూములపై రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ లెక్కన జిల్లాలో 5,700 ఎకరాలను ఫ్రీహోల్డ్‌లో పెట్టారు. అంటే ఈ భూములకు సంబంధించి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇచ్చినట్టేనన్న మాట. కాగా ఆ భూముల్లో చాలా వరకూ అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారన్న అనుమానాలు ఉన్నాయి. వీటిపై కూటమి ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఆగస్టులో ఆయన జిల్లాలో పర్యటించారు. పెద్ద ఎత్తున ఆయనకు జిల్లా ప్రజలు అర్జీలు ఇచ్చారు.
కొనుగోలు చేసిన ఉన్నతాధికారి
వైసీపీ హయాంలో రాష్ట్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కీలక అధికారి పెద్ద ఎత్తున తన కుటుంబసభ్యుల పేరుతో భూములు కొనుగోలు చేశారని సమాచారం. ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన ఉత్తరాంధ్ర పర్యటన వివాదాస్పదంగా మారింది. అప్పట్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల పరిశీలన పేరిట వచ్చిన ఆయన.. భూముల కొనుగోలుకే వచ్చారంటూ విశాఖకు చెందిన జనసేన నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. అయితే కూటమికి విజయం దక్కడంతో ఆ అధికారి సెలవుపై వెళ్లిపోయారు.
ఆ రెండు నియోజకవర్గాల్లో..
ప్రధానంగా నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లోనే అధికంగా భూ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపటుతుండడంతో అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అందుకే డీపట్టా లబ్ధిదారులతో ముందుగానే బేరం మాట్లాడినట్లు సమాచారం. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో 41.6 ఎకరాల ఫ్రీహెల్డ్ ల్యాండ్ రిజిస్ర్టేషన్ జరిగినట్టు సమాచారం. పోలిపల్లిలో 16.04 ఎకరాలు, రావాడలో 3.56 ఎకరాలు, ఎల్.జగన్నాథపురంలో 15.44 ఎకరాలు, పెద్దతాడివాడలో 5.09 ఎకరాలు, కంచేరులో 1.33 ఎకరాల భూమి రిజిస్ర్టేషన్ జరిగింది.
విచారణలో ఆసక్తికర అంశాలు
అధికారుల విచారణల్లో ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎకరా భూమి బహిరంగ మార్కెట్‌లో రూ.50 లక్షలకుగాపైగా ఉంటే ముందస్తు ఒప్పందం మేరకు అసైన్డ్ భూముల లబ్ధిదారుల చేతుల్లో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకూ పెట్టి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ చోటా నేతలే సూత్రధారులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఈ దందాలో ఉన్నారు. ఏదైనాగాని మరో రెండు నెలల్లో అక్రమార్కుల వివరాలను ప్రభుత్వం బయటపెట్టే అవకాశముంది.
--------------------