తాబేళ్ల మృత్యుతీరం
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:17 AM
Turtle mortality అందమైన తీరం ఇప్పుడు తాబేళ్ల మృత్యుతీరమవుతోంది. సముద్రం అంచున కేరింతలు కొడుతూ కనిపించే తాబేళ్లు ప్రాణం కోల్పోయి కంటపడుతున్నాయి

తాబేళ్ల మృత్యుతీరం
జిల్లా సముద్ర తీరంలో కలకలం
ఎక్కడికక్కడే తాబేళ్ల కళేబరాలు
కొద్ది రోజులుగా కంటపడుతున్న వైనం
ఆవేదన చెందుతున్న పర్యాటకులు
మెకనైజ్డ్ బోట్ల తీరు వల్లేనా?
వలల ప్రభావమూ ఉందంటున్న శాస్త్రవేత్తలు
అందమైన తీరం ఇప్పుడు తాబేళ్ల మృత్యుతీరమవుతోంది. సముద్రం అంచున కేరింతలు కొడుతూ కనిపించే తాబేళ్లు ప్రాణం కోల్పోయి కంటపడుతున్నాయి. చేప గుడ్లును మింగేసే జెల్లీఫిష్‌ను తింటూ మత్స్యసంపదను కాపాడుతున్న ఈ జీవులకు ఉన్నట్టుండి ప్రాణాంతక కష్టం వచ్చింది. గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తూ ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయి. కొద్దిరోజులుగా అచేతన స్థితిలో వాటిని చూస్తున్న పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. మెకనైజ్డ్ బోట్లు తీరానికి సమీపంలో వేట సాగించడం, మత్స్యకారులు వాడే ప్రమాదకర వలలు, కాలుష్యం తదితర కారణాలతోనే నేడు అవి జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి. వాటి మనుగడకే ముప్పు తెచ్చే కారణాలను తొందరలోనే గుర్తించకపోతే సముద్రజీవుల సమతుల్యత గతి తప్పుతుంది.
భోగాపురం/పూసపాటిరేగ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో సముద్రతీర ప్రాంతంగా ఉన్న భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో నెల 15రోజుల నుంచి తాబేళ్లు మృత్యువాత పడుతూ తీరాన్ని చేరుతున్నాయి. ఒక్క జనవరి మాసంలోనే 501 తాబేళ్ల కళేబరాలను గుర్తించినట్లు తాబేళ్ల సంరక్షణ కోసం చెన్నై వేదికగా పని చేస్తున్న ట్రీ ఫౌండేషన్ సర్వే ప్రతినిధులు తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికా రులు కూడా ధ్రువీకరించారు. ఇవి కాకుండా సముద్రంలో కలిసిపోయిన మృత తాబేళ్లు ఇంకెన్నో. డిసెంబరు నుంచి మార్చి మధ్యకాలంలో సహజంగా తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటా యి. ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే గతంలోనూ తాబేళ్లు మృతిచెందేవి కాని ఇంత అధికంగా చూడలేదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. కాగా సముద్రంలో మరబోట్లతో చేపల వేట సాగించేవారు సంప్రదాయ వలల స్థానంలో ప్రమాదకర వలలు వాడుతున్నారని, కోనా(గిల్‌నెట్), అటుక, టేకు వలల ప్రభావంతో తాబేళ్లు చనిపోతున్నాయని సర్వే సంస్థ అభిప్రాయపడుతోంది. ఆ వలలను సుమారు 20నుంచి 30 కిలోమీటర్లు లాక్కుని వెళ్తారు. తాబేళ్లు సముద్రపు అడుగున ఉంటున్నప్పటికీ ప్రతీ 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్లీ వెళ్లిపోతాయి. అలాగే గుడ్లు పెట్టే సమయంలోనూ తీరానికి చేరతాయి. ఆయా సమయాల్లో వలలకు చిక్కి చనిపోతున్నట్లు భావిస్తున్నారు. అలాగే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు తిని కూడా చనిపోతున్నాయంటున్నారు. ఏదైనాగాని తాబేళ్లు మృతి చెందకుండా ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. బోట్లుపై వేటసాగించే మత్స్యకారులకు కూడా అవగాహన కల్పించాలి.
ఫ భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లు తినడం నేరం. ఈనేరానికి పాల్పడిన వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తారు. ఏపీ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం తీరం నుంచి 8 కిలోమీటర్ల అవతల చేపలవేట సాగించాలి. అయితే చాలా మంది మత్స్యకారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదకర వలలను నిషేధించి తాబేళ్లకు హాని కలగని వలలను ఉపయోగించాల్సి ఉంది.
ఫ సముద్రతాబేళ్లు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చేపగుడ్లను తినే జెల్లీ ఫిష్‌ను ఈ తాబేళ్లు ఆహారంగా తీసుకోవటంతో మత్స్యసంపద వృద్ధి చెందుతుంది. అదే విధంగా సముద్రపు నాచును కూడా ఇవి ఆహారంగా తీసుకోవడంతో చేపలు గుడ్లు పెట్టేందుకు అనువుగా ఉంటుంది. తాబేళ్లు అంతరించిపోతే మత్స్యసంపదకే ప్రమాదమని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఫ తాబేళ్ల పరిస్థితిపై జిల్లా అటవీశాఖ అధికారి కొండలరావు మాట్లాడుతూ వలల కారణంగానే తాబేళ్లు మృతి చెందుతున్నాయని అంచనా వేస్తున్నామన్నారు. దీనిపై మత్స్యకారులకు అవగాహన కలిగిస్తామన్నారు. తాబేళ్ల పరిరక్షణ సంస్థ ట్రీ ఫౌండేషన్‌కు చెందిన ఉత్తరాంధ్ర సమన్వయకర్త బర్రి కామయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్రపు తాబేళ్లు మృతిచెందడం ప్రమాదకరమన్నారు. మత్యశాఖ, అటవీశాఖ, తమ సంస్థ సంయుక్తంగా దీనిపై దృష్టిసారించి మత్స్యకారులతో మాట్లాడతామన్నారు. మత్స్యశాఖ అధికారులు కూడా మెరైన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.