వైద్య ఆరోగ్యశాఖలో ప్రకంపనలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:57 PM
: ‘కొండ దిగితేనే టీకా’ అనే కథనం జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ప్రకంపనలు సృష్టించింది. ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం వచ్చిన ఈ కథనంపై రాష్ట్రస్థాయిలో చర్చ జరిగింది. దీనిపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఆదేశించింది.

- ‘కొండ దిగితేనే టీకా’ కథనంపై రాష్ట్రస్థాయిలో చర్చ
- విచారణకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశం
- పరుగులు పెట్టిన జిల్లా వైద్య యంత్రాంగం
- దారపర్తి పంచాయతీలో డీఎంహెచ్‌వో, డీఐవో పర్యటన
- కొంతమందిపై చర్యలకు అవకాశం
శృంగవరపుకోట రూరల్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘కొండ దిగితేనే టీకా’ అనే కథనం జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ప్రకంపనలు సృష్టించింది. ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం వచ్చిన ఈ కథనంపై రాష్ట్రస్థాయిలో చర్చ జరిగింది. దీనిపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. డీఎంహెచ్‌వో నుంచి ఆశా కార్యకర్తల వరకు మండలంలోని గిరి శిఖర పంచాయతీ దారపర్తిలో పర్యటించారు. ఉదయం 8 గంటలకే డీఐవో (జిల్లా ఇమూనైజేషన్ ఆధికారి) అచ్యుతకుమారి దారపర్తి పంచాయతీ శనగపాడుకు చేరుకున్నారు. అలాగే, కొట్టాం పీహెచ్‌సీ వైద్యాధికార్లు హారిక, లావణ్య తమ సిబ్బందితో రాయిపాలెం, మనపరాయి, పల్లపుదుంగాడ, పోర్లు, కురిడి గ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటి వరకు టీకాలు వేయని శిశువులు, బాలలను గుర్తించి వారికి మిజిల్స్, విటమిన్-ఏ ద్రావణం ఎక్స్‌ట్రా డోస్ వేశారు. కొలోకేటేడ్ పీహెచ్‌సీ వైద్యులు శిరిష, మానసతో కూడిన వైద్యం బృందం చిట్టంపాడు, గూనపాడు ప్రాంతాలకు వెళ్లి పిల్లలకు టీకాలు వేశారు. దారపర్తి పంచాయతీలో 149 మంది చిన్నారులు ఉండగా దాదాపు 80 శాతం మందికి టీకాలు వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో డీఎంహెచ్‌వో జీవనరాణి శనగపాడు, పల్లపుదుంగాడ తదితర గ్రామాల్లో పర్యటించి టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. చిన్నారులకు టీకాలు వేయని పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశంపై ఆరాతీశారు. దీనికి కారకులు ఎవరు అనే అంశంపై దృష్టి సారించడంతో పాటు కొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
15 రోజుల్లో చర్యలు..
ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ టీకా కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమలుకాకపోవడంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సీరియస్ అయినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఐదేళ్ల వరకు చిన్నారులకు కచ్చితంగా టీకాలు వేయాల్సి ఉంది. కానీ, దారపర్తి పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై అద్యయనానికి రెండు బృందాలను వారం రోజుల్లో పంపించనున్నట్లు సమాచారం. టీకాలు వేయకుండా శిశువుల ఆరోగ్యంతో చెలగాటం ఆడిన వైద్యాధికారులు, సిబ్బంది వివరాలను ఈ బృందాలు సేకరించనున్నాయి. మరో 15 రోజుల్లో వారిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
గిరిజనుల ఆనందం
జిల్లా వైద్య యంత్రాంగమంతా తమ గ్రామాలకు తరలిరావడంతో గిరిజనులు ఆశ్చర్యపోయారు. నెలలో ఒక్కరోజు మాత్రమే ఏఎన్‌ఎం, హెల్త్‌అసిస్టెంట్ కనిపిస్తుంటారని, అలాంటిది తమ గ్రామాల్లో ఒక్కసారిగా జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది పదుల సంఖ్యలో కనిపించడంతో వారంతా అవాక్కయ్యారు. కొంతమంది గిరిజన యువత మాట్లాడుతూ.. తమ దుస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ కళ్లకు కట్టినట్లు చూపించిందని, దీంతో అధికారుల్లో చలనం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి వైద్య సిబ్బంది నెలలో మూడురోజులు గిరి శిఖర గ్రామాలకు వస్తే తమకు ఎన్నో ఆరోగ్యసేవలు అందుతాయని అంటున్నారు.
గిరిజన చిన్నారులకు టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది