Sand Demons ఇది ఇసుకాసురుల పాపమే
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:47 PM
This is the Sin of the Sand Demons ఇసుక గుంత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నదీ స్నానానికి వెళ్లిన వృద్ధుడి ఉసురు తీసింది. భామిని మండలంలో చోటుచేసుకున్న ఘటన అందర్నీ కలవరపరుస్తోంది.

భామిని, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఇసుక గుంత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నదీ స్నానానికి వెళ్లిన వృద్ధుడి ఉసురు తీసింది. భామిని మండలంలో చోటుచేసుకున్న ఘటన అందర్నీ కలవరపరుస్తోంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్లుమడ గ్రామానికి చెందిన కోటిలింగాల చొక్రో (64) రోజూలానే సోమవారం కూడా వంశధార నదికి స్నానానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో పెద్దఎత్తున ఇసుకను తరలించడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. అది గమనించని వృద్ధుడు నీరు ఉన్న ఓ గుంతలో కూరుకుపోయాడు. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన వారు ఆ ప్రాంతానికి చేరుకుని గుంతలో నుంచి చొక్రోను బయటకు తీశారు. అయితే అప్పటికే వృద్ధుడు మరణించినట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న బత్తిలి ఎస్‌ఐ డి.అనిల్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు చోక్రో కుమారుడు నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నదీతీరంలోని ఇసుక ర్యాంప్‌లో తవ్వకాలు జరపడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంతలు ఇంకెంతమందిని బలిగొంటా యోనని వాపోతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.