Share News

But Not the Land! పట్టా ఇచ్చారు.. స్థలం ఇవ్వలే!

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:08 AM

They Gave the Title Deed... But Not the Land! ‘పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం.. జగనన్న కాలనీల పేరిట ప్రత్యేకంగా ఊర్లు ఏర్పాటు చేస్తున్నాం.’ అని గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అయితే ఆచరణలో మాత్రం బోల్తాపడింది. నాడు ఎడాపెడా పట్టాలిచ్చిన వైసీపీ సర్కారు జిల్లాలో ఎంతోమంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను చూపించలేకపోయింది.

 But Not the Land! పట్టా ఇచ్చారు..  స్థలం ఇవ్వలే!
గరుగుబిల్లి మండలం రావుపల్లిలో కొండకు ఆనుకుని పేదలకు కేటాయించిన స్థలాలు ఇలా..

నాడు జగనన్న కాలనీల పేరిట హడావుడి

అర్హులందరికీ ఇళ్లు అంటూ గొప్పలు

నివాసాలకు వీలుకాని ప్రాంతాల్లో స్థలాలు కేటాయింపు

కొందరికి పట్టాలిచ్చి చేతులు దులుపుకున్న వైనం

సొంతింటి కల నెరవేరే అవకాశం లేక.. లబ్ధిదారులు గగ్గోలు

కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

పార్వతీపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం.. జగనన్న కాలనీల పేరిట ప్రత్యేకంగా ఊర్లు ఏర్పాటు చేస్తున్నాం.’ అని గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అయితే ఆచరణలో మాత్రం బోల్తాపడింది. నాడు ఎడాపెడా పట్టాలిచ్చిన వైసీపీ సర్కారు జిల్లాలో ఎంతోమంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను చూపించలేకపోయింది. మరికొందరికి నివాసం యోగ్యం కాని చోట ఇళ్ల స్థలాలిచ్చి చేతులు దులుపుకుంది. మొత్తంగా గత ప్రభుత్వ నిర్వాకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. జాబితాలో పేరున్నా.. స్థలం లేక లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా వారికి నిరాశే మిగిలింది. తాజాగా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో పట్టాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం పేరిట గత ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున పంపిణీ చేసింది. అయితే జిల్లాలో కొండలు, గుట్టలు, నివాసాలకు వీలుకాని ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలిచ్చారు. మరికొందరికి పట్టాలిచ్చి స్థలాలు చూపించలేదు. అయితే ఇటువంటి వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. నిబంధనల ప్రకారం ఒకసారి ఇల్లు కాని స్థలం కాని మంజూరైన వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే వీలు లేదు. అధికారికంగా వారి పేర్లు రికార్డుల్లో నమోదై ఉండడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాకేంద్రానికి సుమారు పది కిలో మీటర్ల దూరంలో ఉన్న నర్సిపురం పంచాయతీ మెట్ట వద్ద పార్వతీపురం పట్టణ వాసులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. మరికొందరికి పట్టణానికి సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న పెదమరికి పంచాయతీ పరిధిలో స్థలాలు ఇచ్చారు. అయితే దూరాభారం కావడంతో అత్యధికులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాలేదు. కొంతమందికి వారి ఇంటి స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

జగనన్న కాలనీల్లో నాటి ప్రభుత్వం పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కూడా కల్పించలేక పోయింది. రోడ్లు, విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు లేకపోవడంతో పునాదుల స్థాయిలో అనేక గృహ నిర్మాణాలు నిలిచిపోయాయి.

300 మందికి ఇవ్వలే..

గరుగుబిల్లి: గత ప్రభుత్వ హయాంలో మండలంలో 541 మందిని గుర్తించారు. అయితే సుమారు 300 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు మాత్రం చూపించలేదు. కాగా ఇప్పటివరకు మండలంలో జగనన్న కాలనీల్లో 17 గృహ నిర్మాణాలే పూర్తయ్యాయి. ఉద్దవోలు, దళాయివలస, కొంకడివరం, రావివలస తదితర ప్రాంతాల్లోనూ కొండలకు ఆనుకుని స్థలాలు ఇచ్చారు. గరుగుబిల్లికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో రావుపల్లి కొండకు ఆనుకుని జగనన్న లే అవుట్‌ ఏర్పాటు చేయగా.. ఈ ప్రాంతంలో 54 మంది కూడా నిర్మాణాలు చేపట్టలేదు.

శ్మశానం పక్కన..

కురుపాం: కురుపాం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న ఎర్ర చెరువు సమీపంలో శ్మశానం పక్కన కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరికొందరికి మరో అర కిలో మీటరు దూరంలో పొలాల వద్ద స్థలాలు కేటాయించారు. అయితే ఆయా ప్రాంతాల్లో గృహ నిర్మాణాలేవీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం చాలకపోవడంతో పునాదులు, మొండి గోడల స్థాయిలో అనేక ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో అవి దర్శన మిస్తున్నాయి.

స్థలాలు ఇవ్వలే..

జియ్యమ్మవలస: చినమేరంగి గ్రామంలో ఉన్న ప్రతాప్‌నగర్‌ కాలనీలో కొందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు మాత్రం ఇవ్వలేదు. ఈ కాలనీలో సర్వే నెంబరు 43/6లో 30 లేఅవుట్లు వేసి గ్రామంలో నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేశారు. వారిలో దళితవాడకు చెందిన పట్లాసింగి కళావతి, బొమ్మాళి శకుంతల, నాగో శోభకు పట్టాలు ఇచ్చారు. అయితే గ్రామంలో కొందరు పెద్దలు వారికి వేరే చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారు. దీంతో వారు గృహ నిర్మాణానికి నోచుకోలేకపోయారు.

ఆన్‌లైన్‌లో మంజూరు కాక..

భామిని: పసుకుడి గ్రామంలో 18 మంది లబ్ధిదారులకు వంశధార వరదకాలువ, బోడికొండ ప్రాంతంలో స్థలాలు కేటాయించారు. అయితే వారికి ఆన్‌లైన్‌లో ఇళ్లు మంజూరైనట్లు చూపించకపోవడంతో గృహ నిర్మాణాలు చేపట్టలేకపోయారు. మండలంలో మొత్తంగా 580 మంది జగనన్న ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా 480 మంది అర్హులుగా గుర్తించారు. అయితే కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు. చిన్నదిమిలి, పెద్దదిమిలి, బాలేరు తదితర గ్రామాల్లో స్థలాలు కోర్టు వివాదంలో ఉన్నాయి. పీఎంఏవై కింద మండలానికి 328 ఇళ్లు మంజూరు కాగా 36 గృహ నిర్మాణాలే పూర్తికాగా 87 వివిధ దశల్లో నిలిచిపోయాయి.

స్థలం చూపించలేదు

గరుగుబిల్లి గ్రామానికి రెండున్నర కిలో మీటర్ల దూరంలో రావుపల్లి కొండకు ఆనుకుని నాకు ఇంటి స్థలం మంజూరైనట్లు గతంలో పట్టా ఇచ్చారు. అయితే స్థలం మాత్రం చూపించలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది.

-గుంట్రెడ్డి జ్యోతి, రావుపల్లి, గరుగుబిల్లి మండలం

=============================

పట్టా ఇవ్వలేదు..

జగనన్న కాలనీలో స్థలం మంజూరైందని చెప్పడంతో ఎంతో ఆనందించా. అయితే పట్టా మాత్రం ఇవ్వలేదు. నాడు అధికారులు, నాయకులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

- దామోదర అనురాధ, పసుకుడి, భామిని మండలం

Updated Date - Feb 12 , 2025 | 12:08 AM