Share News

Mountain! కొండను కొల్లగొడుతున్నారు!

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:17 PM

They are Ravaging the Mountain! పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో బడిదేవర కొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. కోట్లాది రూపాయల గ్రానైట్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  Mountain! కొండను కొల్లగొడుతున్నారు!
బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు జరిపిన దృశ్యం

  • బడిదేవర కొండ వద్ద ఇష్టారాజ్యంగా తవ్వకాలు

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు

  • ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందన్న అటవీశాఖ

  • తవ్వకాలు మాత్రం కొనసాగింపు

పార్వతీపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో బడిదేవర కొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. కోట్లాది రూపాయల గ్రానైట్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాస్తవంగా గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉంది. అక్కడ ఎటువంటి తవ్వకాలు చేపట్టరాదని గత టీడీపీ ప్రభుత్వ కాలంలో అటవీశాఖాధికారులు హైకోర్టుకు వెళ్లారు. ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోనే ఉందని.. అటవీ, గనులు, రెవెన్యూశాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు నివేదికలు అందించారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆ ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017లో జిల్లా గనులశాఖ అధికారులు ఇచ్చిన అనుమతులను అప్పట్లో రద్దు చేసింది. దీంతో 2019 వరకు గ్రానైట్‌ తవ్వకాలు జరగలేదు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సీన్‌ రివర్స్‌ అయింది.

ఇదీ పరిస్థితి..

కోరి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌-1లో రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి చెందినది కాదని ఆ ప్రాంతాన్ని సర్వే ఆఫ్‌ ఇండియా ద్వారా సర్వే చేయించాలని కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్వే చేపట్టిన సర్వే ఆఫ్‌ ఇండియా గతంలో అధికారులు ఇచ్చిన నేదికలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో లేదని కోర్టుకు నివేదించింది. అయితే స్థానిక అటవీశాఖ అధికారులు అభిప్రాయం తీసుకుని కోరి రెవెన్యూ పరిధిలో గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశిం చింది. అయితే కాంట్రాక్టర్లు అటవీశాఖాధికారుల అభిప్రాయం తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం కాలంలో పనిచేసిన జిల్లా ఉన్నతాధికారుల అనుమతులతో గ్రానైట్‌ తవ్వకాలను ప్రారంభించారు. దీంతో అటవీశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గ్రానైట్‌ తవ్వకాలపై వారు ప్రశ్నిస్తే కోర్టు ఆదేశాలను అటవీశాఖాధికారులు ధిక్కరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపణలు చేశారు. దీంతో కొంతకాలం పాటు అటవీశాఖాధికారులు మౌనం వహించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గ్రానైట్‌ తవ్వకాలను అడ్డుకోలేక పోయారు. అయితే దీనిపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని ఇప్పుడు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. న్యాయస్థానానికి సమర్పించాల్సిన పత్రాలను ప్రభుత్వ న్యాయవాదికి అందించామంటున్నారు. అయితే ఇప్పటివరకు వారు కోర్టును ఆశ్రయించలేదు.

ప్రభుత్వం మారినా..

వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత గ్రానైట్‌ తవ్వకాలు నిలిచిపోతాయని ఆ ప్రాంత ప్రజలు భావించారు. కానీ యథావిధిగా తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై టీడీపీ ప్రజ్రాపతినిధులు కూడా మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతన్నాయి. ఇప్పటికే జనసేనపార్టీ ఆందోళన చేసినప్పటికీ తవ్వకాలు ఆగలేదు. బడిదేవరకొండ గ్రానైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఎటువంటి ఫలితం లేకపోయింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రానైట్‌ను కాంట్రాక్టర్లు తరలిస్తున్నారు.

గిరిజనుల ఆరాధ్యదేవత బడిదేవరమ్మ

ప్రస్తుతం గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని బడిదేవరమ్మ కొండగా పిలుస్తారు. పూర్వం నుంచి ఈ కొండ వద్ద గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో బడిదేవరమ్మ దేవతకు పూజలు చేస్తూ.. మొక్కులు చెల్లిస్తారు. గత టీడీపీ ప్రభుత్వం కాలంలో గ్రానైట్‌ తవ్వకాలను హైకోర్టు రద్దు చేయడంతో ఈ ప్రాంతంలో అటవీశాఖ అధికారులను గిరిజనులు గౌరవించడంతో పాటు పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నారు. అయితే వైసీపీ సర్కారు హయాంలో మళ్లీ తవ్వకాలు చేపట్టిన నాటి నుంచి వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ స్పందించి తగు ఆదేశాలను జారీ చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

హైకోర్టుకు వెళ్తాం..

కోరి రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్‌-1లో ప్రస్తుతం గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిందని అటవీశాఖ గతంలో ఆధారాలతో సహా నిరూపించింది. తిరిగి అదే ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీనిపై తిరిగి హైకోర్టుకు వెళ్తాం.

- బి.రామ్‌నరేష్‌, పార్వతీపురం అటవీశాఖ రేంజర్‌

Updated Date - Mar 05 , 2025 | 11:17 PM