Share News

digging in river కలిసిపోయి.. తవ్వేస్తున్నారు

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:57 PM

They are digging together బొబ్బిలి నియోజకవర్గంలోని కొంతమంది తెలుగు తమ్ముళ్లు వైసీపీ నాయకులతో కలిసి అక్రమాలకు తెగబడుతున్నారు. వేగావతి నదిలో ఇసుకను తవ్వుకు పోతున్నారు. రోజుకు 40 నుంచి 50 ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డువస్తే బెదిరింపులకు దిగుతున్నారు.

digging in river కలిసిపోయి.. తవ్వేస్తున్నారు
అలజంగి వద్ద వేగావతి నదిలో ట్రాక్టరుకు అక్రమంగా లోడుచేస్తున్న దృశ్యం

కలిసిపోయి.. తవ్వేస్తున్నారు

వేగావతి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు

అధికార, వైసీపీ స్థానిక నాయకుల యవ్వారం

అలజంగి వద్ద ఊటబావులకు పొంచి ఉన్న ముప్పు

అధికార యంత్రాంగానికి స్థానికుల ఫిర్యాదులు

బొబ్బిలి నియోజకవర్గంలోని కొంతమంది తెలుగు తమ్ముళ్లు వైసీపీ నాయకులతో కలిసి అక్రమాలకు తెగబడుతున్నారు. వేగావతి నదిలో ఇసుకను తవ్వుకు పోతున్నారు. రోజుకు 40 నుంచి 50 ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డువస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అలజంగి గ్రామంలో ప్రతిరోజూ జరుగుతున్న తంతు ఇది. వేకువజామున 3.50 గంటల నుంచి ఆ ఊరిమీదుగా నదిలోకి ట్రాక్టర్లు క్యూ కడుతున్నాయి. వందలాది టన్నుల ఇసుకను తీసుకు పోతున్నాయి. ఇలాంటి అక్రమాల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విజయనగరం/బొబ్బిలి, జనవరి 18(ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి మండలం అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. దీనిపై స్థానిక అధికారులు ఎవ్వరూ నోరుమెదపడం లేదు. కొందరు అధికార పార్టీ నాయకులు, వైసీపీలో కొంతమంది గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు ఒక్కటై వ్యవహారం నడుపుతున్నారు. వారి ధనదాహానికి సుమారు 50పైగా గ్రామాలకు నీరు అందించే నదిలోని ఇన్‌ఫిల్టర్‌ బావులు ప్రమాదంలో పడ్డాయి. నదిలో ఆక్రమంగా ఇసుకును తవ్వుతున్న వారి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. ఇంత జరుగుతుంటే స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా పోతుందా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతామన్న కూటమి ప్రభుత్వం చెబుతున్నా.. అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

అనుమతి లేకపోయినా..

ప్రభుత్వ ఇసుక రీచ్‌ అక్కడ లేకపోయినా అడ్డుగోలుగా ఇసుకను తవ్వేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో ఏకంగా బహిరంగ వేలాలు నిర్వహించుకుని మరీ అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ఇసుకాసురులు అక్రమ సంపాదన యావతో తమవైన విధానాలను అమలు చేసుకుంటున్నారు. ఎడ్లబళ్లతో ఇసుకను రవాణా చేసేవారికి సీఎం చంద్రబాబు వెసులుబాటుకల్పించిన సంగతి తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు నాటుబళ్లతో ఇసుకను రవాణా చేసి ఓ చోట గుట్టలుగా పోగేసి అక్కడ నుంచి అక్రమంగా లారీలు, ట్రాక్టర్‌లతో రవాణా చేస్తున్నారు.

- బొబ్బిలి మండలం అలజంగి, బాడంగి మండలం పాల్తేరు గ్రామాల్లో వేగావతి నదిలో ఈ అక్రమ దందా జోరుగా సాగుతోంది. దీనిపై కలత చెందిన కొందరు రైతులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు, పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు.

- ఇసుక అక్రమ రవాణాకు ఎవరైనా అడ్డు చెప్పినా, అభ్యంతరం వ్యక్తం చేసినా మాఫియా తన తడాఖా చూపిస్తున్నట్లు ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

- వేగావతి నది సమీపంలో జిరాయితీ భూములు కలిగిన రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పంట భూములు, తోటలు సాగుకోసం ఏర్పాటు చేసుకున్న బోరు బావులు ఎండిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.

- బాడంగి, దత్తిరాజేరు మండలాలకు చెందిన 58 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు పాల్తేరు సమీపంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ తాగునీటిపథకం ఏర్పాటు చేశారు. రానున్న వేసవి కాలంలో ఇసుక మాఫియా కార్యకలాపాల ప్రభావంతో తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి మండలం పెంట తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు రెవెన్యూ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేయడం, ఆందోళనలు చేసిన ఘటనలు గతంలో ఉన్నాయి.

నీటి వనరులకు ముప్పు

చిలుకూరి వెంకటనారాయణరావు, పామాయిల్‌ రైతు, అలజంగి

ఇసుక మాఫియా కారణంగా తాగు, సాగునీటి వనరులకు పెనుముప్పు కలుగుతుంది. రైతుల్లో చాలా ఆందోళన నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇసుక రీచ్‌ లేనప్పుడు ఇక్కడ నుంచి ఇసుకను ఎలా తవ్వుతారు. గత ఏడాది బోర్లు ఎండిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వేసవిలో కూడా అలాంటి ప్రమాదం మళ్లీ రాకుండా నీటి వనరులను రక్షించుకోవాలి. ఈ ప్రాంత రైతులంతా కలిసి ప్రభుత్వ యంత్రాంగానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాము. నాటు బళ్లను బూచిగా చూపి ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడుతోంది. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన చాలా మంచి ప్రజాప్రతినిధి. ఆయన ఇసుకాసురులను గట్టిగా హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడడం తగదు.

Updated Date - Jan 18 , 2025 | 11:57 PM