Share News

doctors : వైద్యులు వచ్చేశారోచ్‌..

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:00 AM

doctors :జిల్లాలో ఆయుర్వేదిక్‌, హోమియో డిస్పెన్సరీలకు వైద్యుల నియామకం పూర్తయింది.

doctors :    వైద్యులు వచ్చేశారోచ్‌..

-జిల్లాలో ఆయుర్వేదిక్‌, హోమియో డిస్పెన్సరీల్లో పోస్టుల భర్తీ

- ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు

జియ్యమ్మవలస, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయుర్వేదిక్‌, హోమియో డిస్పెన్సరీలకు వైద్యుల నియామకం పూర్తయింది. ఈ నెల 11న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వైద్యులు ఎప్పుడోస్తారో..? కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఆయూష్‌ విభాగ కమిషనర్‌(విజయవాడ) ఆదేశాల మేరకు జిల్లాలో ఆయుర్వేదిక్‌, హోమియో డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు.


పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

జిల్లాలో 12 ఆయుర్వేదిక్‌ డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో జియ్యమ్మవలస, రస్తాకుంటుబాయి, బూర్జ, మక్కువ, దుగ్గేరు, సాలూరు, సీతంపేట, కవిరిపల్లి, సీతానగరం రెగ్యులర్‌ డిస్పెన్సరీలు. వీటిలో బూర్జ, సాలూరు, కవిరిపల్లి డిస్పెన్సరీల్లో మాత్రమే వైద్యులు ఉండేవారు. దుగ్గేరు డిస్పెన్సరీ పూర్తిగా మూతపడింది. డోకుశీల, రావివలస, అన్నవరంలో కాంట్రాక్ట్‌ ఆయుర్వేదిక్‌ డిస్పెన్సరీలు ఉన్నాయి. అన్నవరం డిస్పెన్సరీకి మాత్రమే వైద్యులు ఉండగా, మిగిలిన చోట్ల లేరు. అలాగే జిల్లాలో 7 హోమియో డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో పార్వతీపురం, గరుగుబిల్లి, తలవరం, బాసూరు డిస్పెన్సరీలు రెగ్యులర్‌ కాగా, ఇందులో ఒక్క పార్వతీపురంలో మాత్రమే వైద్యురాలు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు లేక మిగిలిన మూడు డిస్పెన్సరీలు మూతపడ్డాయి. కాంట్రాక్ట్‌ హోమియో డిస్పెన్సరీలు గళావలి, కుశిమి, మర్రిపాడులో ఉన్నాయి. కుశిమి, మర్రిపాడులో వైద్యులు ఉండగా, గళావిల్లిలో లేరు.


గత వైసీపీ ప్రభుత్వం ఆయుర్వేదిక్‌, హోమియో వైద్యశాలల విషయంలో అస్సలు పట్టించుకునే దాఖలాలు లేవు. ఎంతమంది ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడేవారు. దీనిపై ఈ నెల 11న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. విశాఖపట్నం జోన్‌-1 పరిధిలోని ఆయుర్వేదిక్‌, హోమియో డిస్పెన్సరీల్లో వైద్య పోస్టుల ఖాళీలను భర్తీ చేసింది. జిల్లాకు సంబంధించి జియ్యమ్మవలస, రస్తాకుంటుబాయి, మక్కువ, దుగ్గేరు, సీతం పేట, సీతానగరంలోని రెగ్యులర్‌ ఆయుర్వేదిక్‌ డిస్పెన్సరీలకు వైద్యులను నియమించారు. అలాగే గరుగుబిల్లి, తలవరం, బాసూరు హోమియో డిస్పెన్సరీలకు కూడా వైద్యులను నియమించారు. ఈ మేరకు విశాఖపట్నం జోన్‌-1 ఆయూష్‌ విభాగ ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్‌ డి.ఝాన్సీలక్ష్మీభాయ్‌ నుంచి కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు గురువారం లేఖ అందింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:00 AM