patient problems రోగుల ‘ఘోష’
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:44 PM
The 'cry' of patients విజయనగరం ఘోషాసుపత్రిని ఆశ్రయించే రోగులకు ఊరట కరువు అవుతోంది. నమ్మకం సన్నగిల్లుతోంది. అక్కడున్న పరిస్థితులు చూసి ముందే నిరాశ పడుతున్నారు. సేవలు కూడా అంతంతమాత్రమే. అక్కడకు ఎక్కువగా పిల్లలు, బాలింతలు, గర్భిణులే వెళ్తారు. వైద్యం మాట ఎలా ఉన్నా కనీస సౌకర్యాలు అందడం లేదు. సోలార్ వాటర్ హీటర్ మూలకు చేరితే సంవత్సరాలుగా పట్టించుకోవడం లేదు. కార్డియాలజీ వైద్యుడు లేడు. హైరిస్క్ పేషెంట్లు వచ్చి నిరాశతో వెళ్లిపోతున్నారు.

రోగుల ‘ఘోష’
గత ప్రభుత్వం పట్టించుకోక పెరిగిన సమస్యలు
కార్డియాలజీ వైద్యుడు లేరు
హైరిస్క్ కేసులు వస్తే విశాఖ కేజీహెచ్‌కు రెఫర్
పనిచేయని సోలార్ వాటర్ హీటర్ పరికరాలు
విజయనగరం ఘోషాసుపత్రిని ఆశ్రయించే రోగులకు ఊరట కరువు అవుతోంది. నమ్మకం సన్నగిల్లుతోంది. అక్కడున్న పరిస్థితులు చూసి ముందే నిరాశ పడుతున్నారు. సేవలు కూడా అంతంతమాత్రమే. అక్కడకు ఎక్కువగా పిల్లలు, బాలింతలు, గర్భిణులే వెళ్తారు. వైద్యం మాట ఎలా ఉన్నా కనీస సౌకర్యాలు అందడం లేదు. సోలార్ వాటర్ హీటర్ మూలకు చేరితే సంవత్సరాలుగా పట్టించుకోవడం లేదు. కార్డియాలజీ వైద్యుడు లేడు. హైరిస్క్ పేషెంట్లు వచ్చి నిరాశతో వెళ్లిపోతున్నారు.
విజయనగరం రింగురోడ్డు, జనవరి 30(ఆంధ్రజ్యోతి):
ఘోషాసుపత్రికి ప్రతిరోజూ 200 పైగా ఓపీ ఉంటుంది. ఇందులో ప్రధానంగా గైనిక్ సమస్యలతో ఉన్న మహిళలు 40 నుంచి 50 మందికి పైగా ఉంటున్నారు. మిగతా వారు గర్భిణులు, చిన్నపిల్లలు (పిడియాట్రిక్). ప్రసవం కోసం రోజూ పదిమందికి తక్కువ కాకుండా వస్తుంటారు. ఈ విధంగా ఘోషాసుపత్రికి ఓపీ ఫుల్‌గా ఉంటుంది. ఒక్కోరోజు కూర్చొనేందుకు స్థలం ఉండదు. సీజనల్ వ్యాధులు ముసురుకునే సమయంలో ఆస్పత్రి కోలాహలంగా మారిపో తుంటుంది. అంత కీలకమైన ఆస్పత్రి అయినప్పటికీ గత పాలకులు పూర్తిగా విస్మరించారు. కేంద్రమంత్రిగా అశోక్ గజపతిరాజు బాధ ్యతలు నిర్వహించిన సమయంలో తమ ఎంపీ కోటా నిధుల నుంచి ఘోషాసుపత్రిలో సోలార్ యూనిట్ ఏర్పాటు చేశారు. 2,500 లీటర్ల కెపాసిటీతో ఐదు వాటర్ ట్యాంకులు ఏర్పాటుచేసి వాటికి హీటర్‌లను అనుసంధానం చేశారు. 2019 నుంచి 2024లో హీటర్లు పనిచేయడం మానేశాయి. వీటి గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఐదేళ్ల కాలంలో గర్భిణులు వేడి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ సోలార్ యూనిట్ పనిచేయడం లేదు.
కార్డియాలజీ వైద్యుడేరి?
ఘోషాసుపత్రికి వచ్చే హైరిస్క్ పేషెంట్లు, గర్భిణీల్లో చాలా మంది గుండె సమస్యలు, బీపీ వంటి వాటితో వస్తుంటారు. నవజాత శిశువుల్లో కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఈ పరిస్థితిలో కార్డియాలజీ వైద్యుడు కీలకం. అయినా నియమించడం లేదు. ఈ పోస్టు దాదాపు పదేళ్లుగా ఖాళీగా ఉంది. హైరిస్క్ పేషెంట్లు, నవజాత శిశువులు వస్తే ఘోషాసుపత్రి వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. కేజీహెచ్‌కు వెళ్లలేని వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి జోబులను గుల్ల చేసుకుంటున్నారు.
లిఫ్ట్ లేదు
ఘోషాపుపత్రిలో లిఫ్ట్ సౌకర్యం లేదు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు, రెండు ఫ్లోర్‌లు వున్నాయి. వీటికి వెళ్లాలంటే గర్భిణులు కూడా మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. లిఫ్ట్ విషయమై తాజాగా ప్రతిపాదనలు పంపినట్టు ఘోషాసుపత్రి వర్గాలు తెలిపాయి.
పెచ్చులూడుతున్న స్లాబు
ఘోషాసుపత్రి పురాతన భవనంలో ఉంది. ఎప్పటికప్పుడు గదుల నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. ఈ నెల 29న ఘోషాసుపత్రి విభాగంలో ఎస్‌ఎన్‌సీయులో స్లాబ్‌లు పెచ్చులూడడంతో సీలింగ్ సైతం కొంతభాగం కింద పడిపోయింది. నవజాత శిశువులకు సంబంధించిన గది అది. ప్రస్తుతానికి అందులో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది.
శుభ్రంగా లేని మరుగుదొడ్లు
ఘోషాసుపత్రిలో మరుగుదొడ్ల పరిస్థితి దారుణం. వాటి నిర్వహణ అధ్వానం. శుభ్రత ఉండడం లేదని అక్కడున్న వారంతా చెబుతున్నారు. బాలింతలు, గర్భిణులు వినియోగించుకోలేని దుస్థితి. నిర్వహణపై ఉన్నతాధికారులు సమీక్షించి చర్యలు తీసుకుంటేనే పరిస్థితి మారుతుంది.
రేడియాలజిస్ట్ కొరత
ఘోషాసుపత్రిలో గర్భిణులకు ఆలా్ట్ర సౌండ్ స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ అవసరం. నెలలుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. గర్భిణులను అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్రాసుపత్రికి పంపించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ఘోషాసుపత్రి
ఘోషాసుపత్రిలో సమస్యలన్నింటినీ ఉన్నతాధికారులకు నివేదిస్తాం. లిఫ్ట్ గురించి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిధులు కేటాయించారు. త్వరలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వైద్య సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.