ఆ గంట.. ఎందుకంట?
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:13 AM
రాజాంలో మద్యం షాపులు మూడు రోజులుగా నిర్ణీత సమయం కన్నా ముందే మూతపడుతున్నాయి. గంట ముందు షట్టర్ దించేస్తున్నారు. సాధారణంగా పది నిమిషాలు ఆలస్యంగా మూత పడే దుకాణాలు ఇప్పుడెందుకలా అని మద్యం ప్రియులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ గంట.. ఎందుకంట?
నిర్ణీత సమయం కన్నా ముందే మద్యం దుకాణాల మూత
బార్లకు లబ్ధి చేకూర్చేందుకేనా?
సిండికేటైనట్లు సర్వత్రా అనుమానం
రాజాం రూరల్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): రాజాంలో మద్యం షాపులు మూడు రోజులుగా నిర్ణీత సమయం కన్నా ముందే మూతపడుతున్నాయి. గంట ముందు షట్టర్ దించేస్తున్నారు. సాధారణంగా పది నిమిషాలు ఆలస్యంగా మూత పడే దుకాణాలు ఇప్పుడెందుకలా అని మద్యం ప్రియులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బార్లుకు మేలు చేసేందుకే ఇలా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ కలిసిపోయి మందుబాబులను దోచుకునే ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
మద్యం విక్రయాలు, బెల్ట్‌షాపులకు బాటిళ్ల సరఫరా, ధరల పెంపు, షాపుల వద్ద తాగేందుకు ఏర్పాట్లు చేయడం తదతర అంశాలపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుంటే.. రాజాంలో మద్యం షాపుల యజమానులు మాత్రం అంతా మా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేఽశించిన సమయాలను కాదని సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఓ గంట ముందే షాపుల్ని బంద్ చేస్తున్నారు. బార్లతో పాటు మద్యం దుకాణాలూ ఇటీవల సిండికేటైన నేపధ్యంలో గంట ముందు షాపుల్ని మూసివేస్తున్నారు. ఇలా చేస్తే మద్యం ప్రియులు బార్లవైపు పరుగులు పెడతారని, బార్లలో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతుండంతో అందరికీ నాలుగు రాళ్లు కలిసొస్తాయన్న ఆలోచనతో మద్యం దుకాణాల యజమానులు ఈ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. గడచిన మూడు రోజులుగా రాత్రి 9 గంటలకే మద్యం దుకాణాలకు షట్టర్లు మూత పడుతుండడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ తెరిచి ఉంచాలి.
మద్యం షాపుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువకు అమ్మేందుకు వీలుకాదు. కానీ సమయం, సందర్భాన్ని బట్టి బార్లలో ఎమ్మార్పీ కన్నా అదనంగా వసూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా రాత్రి పది గంటలకు మద్యం దుకాణాలు మూయాల్సి ఉండగా ఓ గంట ముందు షాపులకు తాళాలు వేస్తే మద్యం ప్రియులు గత్యంతరం లేక బార్లను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. ఆ గంటలో బార్లకు అదనంగా ఆదాయం రానుంది. దీంతో సిండికేట్‌గా ఏర్పడిన వీరంతా ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చి గడచిన మూడురోజులుగా షాపుల్ని బంద్ చేస్తున్నారు. మద్యం ప్రియులు విలవిల్లాడుతూ గత్యంతరం లేని పరిస్థితుల్లో అదనపు ధర చెల్లించుకుంటున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
బాబ్జీరావు, డిప్యుటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఉదయం పది నుంచి రాత్రి పదిగంటల వరకూ మద్యం షాపులు ఖచ్చితంగా తెరిచి ఉంచాలి. రాజాంలో రాత్రి తొమ్మిది గంటలకే మద్యం షాపులు మూసివేయడంపై దర్యాప్తు చేస్తాం. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. రాత్రి పదిగంటల వరకూ షాపులు తెరిచి ఉంచేలా మరోసారి ఆదేశాలు జారీచేస్తాం.