Surveys సకాలంలో సర్వేలు పూర్తిచేయాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:40 PM
Surveys Must Be Completed on Time జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సర్వేలు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు రెవెన్యూ సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

రెవెన్యూ సేవలందించడంలో నిర్లక్ష్యం వద్దు
జియ్యమ్మవలస, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సర్వేలు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు రెవెన్యూ సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన జియ్యమ్మవలస తహసీల్దార్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ఎంఎస్‌ఎంఈల సర్వే, పీఎం జన్‌మన్, గృహ నిర్మాణాలపై ఆరా తీశారు. లబ్ధిదారులను చైతన్యపరిచి గృహాలు నిర్మించుకునేలా చూడాలన్నారు. అంతకు ముందు ఆయన లోతువానివలసలో రూ. 80 లక్షలతో చేపడుతున్న రహదారి పనులను పరిశీలించారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సేవలు పెండింగ్‌లో ఉంచరాదన్నారు. ఇన్‌చార్జి తహసీల్దార్ ఆర్.పకీరు, ఎంపీడీవో ఎస్.రమేష్, పీఆర్ జేఈ పార్థసారది తదితరులు పాల్గొన్నారు.
ఆశావహ జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండాలి
పార్వతీపురం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆశావహ జిల్లాల్లో ‘పార్వతీపురం మన్యం’ అగ్రగామిగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఆ విభాగంలో జిల్లాక పీఎం అవార్డు రావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారుతో సమీక్షించారు. గత త్రైమాసికంగా భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నీతి అయోగ్ మార్గదర్శకాలు, సూచికల ప్రకారం జిల్లాలో పనులు చేపట్టాలని సూచించారు. పార్వతీపురంలో రూ.3 కోట్లతో ఇన్నోవేటివ్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగంలో పనులు, అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్, గిరిజనుల జీవనోపాధి, అంగన్‌వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ, దివ్యాంగులకు ఉపకర ణాలు గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు వంటి అంశాలతో జాతీయ స్థాయిలో అవార్డుకు పోటీపడే అవకాశాలున్నాయన్నారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, డీఈవో ఎన్.తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.