Share News

Horticulture Farmers ఉద్యాన రైతులకు తోడ్పాటు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:29 PM

Support for Horticulture Farmers జిల్లాలో జీడి పప్పు ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఉద్యాన రైతులకు తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Horticulture Farmers  ఉద్యాన రైతులకు తోడ్పాటు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

పార్వతీపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీడి పప్పు ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఉద్యాన రైతులకు తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జీడిపప్పు మార్కెటింగ్‌లో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. వీడీవీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా లెమన్‌ గ్రాస్‌ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. అయితే ఇప్పటికే 200 ఎకరాల్లో లెమన్‌ గ్రాస్‌ సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే శ్రీనిధి, బీసీ కార్పొరేషన్‌ ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేసి వేయి ఎకరాల్లో సాగు లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ-క్రాప్‌లో నమోదైన పంటలు, ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వివరాలు, విస్తీర్ణ సాగు ఒకేలా ఉండేలా చూసుకోవాలన్నారు. భామిని కేంద్రం వద్ద మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని ఏడీ మార్కెటింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఎఫ్‌వో ప్రసూన, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్‌, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు కె.రామచంద్రరావు, వై.సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వడ్డీ లేని పంట రుణాలపై అవగాహన

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అందించనున్న రూ.లక్షలోపు వడ్డీలేని పంట రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ.. రబీసీజన్‌కు సంబంధించి రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. 2023 ఖరీఫ్‌ రుణాలను తిరిగి చెల్లించిన వారి వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. పీఎం స్వానిధి, ముద్ర తదితర రుణాల మంజూరులో కొన్ని బ్యాంకులు వెనుకబడి ఉన్నాయన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:29 PM