చదువు.. నిద్ర ఒక్కచోటే!
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:41 PM
Study and Sleep in the Same Place! జియ్యమ్మవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా బోధన, మెనూకు ఏ ఇబ్బందీ లేకపోయినా.. ఇరుకు గదులతో వారు నానా అవస్థలు పడుతున్నారు.

చాలీచాలని గదులతో విద్యార్థుల అవస్థలు
జియ్యమ్మవలస, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా బోధన, మెనూకు ఏ ఇబ్బందీ లేకపోయినా.. ఇరుకు గదులతో వారు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా ఈ ఆశ్రమ పాఠశాలలో 70 మంది విద్యార్థులున్నారు. హెచ్‌ఎం ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో ఐదుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు సీఆర్‌టీలు వారికి బోధిస్తున్నారు. గత రెండేళ్లలో ఈ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు వసతి గృహ సంక్షేమాధికారి హిమరిక సత్యం పర్యవేక్షణలో సక్రమంగా మెనూ అమలు చేస్తున్నారు. అయితే ఈ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిది చిన్న గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకటి హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు, మరొకదానికి స్టోర్ రూముగా వినియోగిస్తున్నారు. ఇంకోదానిలో మినరల్ వాటర్ ప్లాంటు ఉంది. మిగిలిన ఐదు గదుల్లోనే ఉదయం వేళల్లో విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. అయితే వసతి సమస్య కారణంగా రాత్రి వేళల్లో వారు అక్కడే పడుకోవాల్సి వస్తోంది. విశాలమైన పాఠశాల ప్రాంగణం ఉన్నా సరైన వసతి, తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో పది సంక్షేమ వసతి గృహాల ఆధునికీకరణకు కేంద్రం నుంచి రూ. 6 కోట్లు మంజూరైనా.. ఆ జాబితాలో ఈ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టర్ స్పందించి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘గతంలో ఇక్కడికి వచ్చిన అధికారులందరూ పాఠశాల పరిస్థితి చూశారు. నూతన భవనం మంజూరైందని చెప్పారు. దీనికి సంబంధించిన లెటర్ కూడా ఉన్నతాధికారులకు పంపించా మన్నారు. భవన నిర్మాణ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.’ అని టీడబ్ల్యూఏ బాలుర హైస్కూల్ హెచ్‌ఎం వి.ధనుంజయనాయుడు తెలిపారు.