Education System విద్యా వ్యవస్థ పటిష్ఠం!
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:34 PM
Strong Education System గత వైసీపీ సర్కారు పాలనలో జీవో నెంబర్ 117తో దారి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పాఠశాలల విలీనంలో చేర్పులు, మార్పులకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశాలిచ్చింది.
జిల్లాలో పెరగనున్న హైస్కూల్స్
నూతన విధానంలో ఐదు రకాల బడులు
పాఠశాలల విలీనంలో మార్పులు, చేర్పుల కోసం అధికారుల కసరత్తు
పార్వతీపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు పాలనలో జీవో నెంబర్ 117తో దారి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పాఠశాలల విలీనంలో చేర్పులు, మార్పులకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశాలిచ్చింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఇదివరకు ఉన్నత పాఠశాలలో విలీనమైన మూడు, నాలుగు, ఐదు తరగ తులను వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక విద్యకు ఊపిరిపోయనుంది. పంచాయతీకి ఒక ప్రాథమిక పాఠశా లను మోడల్ ప్రైమరీ స్కూల్‌గా మార్చనుంది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవ త్సరంలో ఐదు రకాల బడుల విధానం అమలు చేయబోతున్నారు. మొత్తంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఒకటి నుంచి రెండు తరగతుల వరకు 90 పాఠశాలలు ఉండేవి. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 857 పాఠశాలలు, ప్రైమరీ హైస్కూల్స్ అంటే మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు 79 బడులు ఉండేవి. హైస్కూల్స్ ఆరు నుంచి పదో తరగతుల వరకు 39 ఉండేవి. ఒకటి నుంచి 10వ తరగతి వరకు 61 పాఠశాలలు , ఆరు నుంచి 12వ తరగతి వరకు ఐదు పాఠశాలలు ఉండేవి. మొత్తం జిల్లాలో 1,131 పాఠశాలలుఉండేవి. మార్పులు, చేర్పులు తర్వాత పాఠశాలల సంఖ్య 1140కు చేరనుంది.
- కొత్త విధానం ద్వారా జిల్లాలో ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి తరగతి నుంచి రెండు తరగతుల వరకు 252 పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. బీపీఎస్ పాఠశాలలు 507, ఎంపీఎస్ బడులు 267 , హైస్కూల్స్ 114 స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా కొత్త విద్యా విధానం ద్వారా జిల్లాలో 1140 పాఠశాలలు ఏర్పడే అవకాశం ఉంది.
- గత వైసీపీ ప్రభుత్వ పాలనలో.. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. 60 మందికి ఇద్దరు టీచర్లు ఉండేవారు. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 60 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తోంది.
ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు..
- పంచాయతీ కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కడైతే 60 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారో... ఆ స్కూల్‌ను ఆదర్శ ప్రాథమిక పాఠశాల (మోడల్ ప్రైమరీ స్కూల్)గా మార్చనున్నారు. వాటికి ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయనున్నారు. మిగతా ప్రాథమిక పాఠశాలలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. కొత్త విధానంలో కొన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కనుమరుగయ్యే అవకాశం ఉంది.
- ప్రస్తుతం ఉన్న యూపీ పాఠశాలల్లో 6,7, 8 తగరతుల విద్యార్థులు 60 మంది కంటే ఎక్కువగా ఉండి.. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ లేకుంటే ఆ యూపీ పాఠశాలనే ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయనున్నారు. 60 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న యూపీ పాఠశాల విద్యార్థులను సమీప హైస్కూల్‌కు పంపించమన్నారు. ఈ మార్పులు, చేర్పుల కోసం క్షేత్రస్థాయిలో విద్యా శాఖాధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
పాఠశాలలు పెరగనున్నాయి..
గతంలో కంటే జిల్లాలో హైస్కూల్స్ సంఖ్య పెరగనుంది. ఎక్కడా పాఠశాలలు ఎత్తివేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నివేదికలు సిద్ధం చేస్తున్నాం.
- ఎన్.,తిరుపతిరావు, డీఈవో, పార్వతీపురం మన్యం