Share News

manyam Development మన్యం అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:33 AM

Striving for manyam Development జిల్లా అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు.

 manyam Development మన్యం అభివృద్ధికి కృషి
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎంపీ తదితరులు

కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతవాసులకు విద్య, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, చిన్నారుల్లో ఎనీమియా లోపాన్ని అధిగమించాలన్నారు. గ్రామాలకు ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లను పంపించి రక్తహీనతతో బాధపడుతున్న వారిని దత్తత తీసుకోవాలని సూచించారు. మెరుగైన చర్యలు చేపట్టడం వల్ల రక్తహీనత బాధితుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపారు. సౌర విద్యుత్‌, వ్యవసాయం ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకం వల్ల ప్రజలకు విద్యుత్‌ భారం తగ్గుతుందని వెల్లడించారు. జిల్లాలో పీఎం అర్బన్‌ ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణాలను గడవులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు రాష్ట్ర హైవేలను జాతీయ రహదారులుగా మార్పు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిం చినట్టు తెలిపారు. పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శాఖల వారీగా అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. అనంతరం అరకు ఎంపీ తనూజారాణి మాట్లాడుతూ.. లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎంపీ ల్యాండ్‌ నిధులతో రోడ్లు డ్రైనేజీ కమ్యూనిటీ భవనాల నిర్మాణాల పనుల వివరాలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, భవన నిర్మాణాలు, పాఠశాలలో మరుగుదొడ్లు మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిత, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో కె.హేమలత, డీఎంహెచ్‌వో భాస్కరరావు ,డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్‌పాల్‌, జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాలికల వికాసానికి పటిష్ఠ చర్యలు

బాలికల వికాసానికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. 11 నుంచి 18 సంవత్సరాల లోపు పాఠశాల, కళాశాల విద్యార్థులు, బడి బయట ఉన్న 11 నుంచి 18 వయసు లోపు వారిని గ్రూప్‌లుగా విభజించాలన్నారు. వారి సంరక్షణ, పోషణ అవసరాలు, కౌమార బాలికల సమస్యలు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు అరికట్టాలని, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

పీఎం జన్మన్‌ పీవీటీజీ పథకం కింద జిల్లాకు 2,597 ఇళ్లు మంజూరవగా, మార్చి నెలాఖరుకు 184 గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాలపై దృష్టి సారించాలని సూచించారు.

Updated Date - Jan 09 , 2025 | 12:33 AM