Share News

irrigation: ఆగిన ప్రాజెక్టులు.. సాగునీటికి ఇబ్బందులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:52 PM

irrigation:జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో సాగునీరు అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

 irrigation: ఆగిన ప్రాజెక్టులు.. సాగునీటికి ఇబ్బందులు
నిలిచిపోయిన వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు

- పనులు పూర్తిచేస్తేనే రైతులకు మేలు

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో సాగునీరు అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పార్వతీపురం మండలంలోని అడారు గడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం గతంలో రూ.5 కోట్లు ఖర్చు చేశారు. కానీ, నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. ప్రస్తుతం సుమారు 650 ఎకరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేస్తే మరికొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. అదే విధంగా మక్కువ మండలంలో నిలిచిపోయిన అడారు రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తే రైతులకు ఎంతో మేలు కలగనుంది.


అలాగే, పాలకొండ నియోజకవర్గంలోని జంపర్‌కోట, గుమ్మడి రిజర్వాయర్‌తో పాటు పావురాయిగడ్డ తదితర మినీ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఒడిశాతో ఉన్న సమస్య కారణంగా కొన్ని దశాబ్దాలుగా జంఝావతి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం జంఝావతి హైలెవెల్‌ తదితర కెనాల్‌ పనులైనా పూర్తి చేస్తే కొన్ని వందల ఎకరాలకైనా సాగునీరు అందించవచ్చు. అలాగే, వీఆర్‌ఎస్‌, పెద్ద గెడ్డ, పెదంకలం, వట్టిగెడ్డ రిజర్వాయర్ల ఆధునికీకరణ పనులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెలించలేదు. దీంతో ఆ పనులను మధ్యలోనే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ పనులు పూర్తవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:52 PM