Neighboring Districts! ఇంకా పొరుగు జిల్లాలకే పరుగు
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:40 PM
Still Rushing to Neighboring Districts! పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా.. నేటికీ పూర్తిస్థాయి వసతులకు నోచుకోవడం లేదు. జిల్లాకేంద్రం కూడా అన్ని రకాలుగా వెనుబడి ఉంది. పేరుకే జిల్లాకేంద్రమైనా.. ఇక్కడ ఉన్నత విద్య కళాశాలలు.. నైపుణ్య శిక్షణ కేంద్రాలు లేకపోవడంతో గిరిజన, మైదాన ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తిస్థాయి వసతులకు నోచుకోని వైనం
పేరుకే జిల్లా కేంద్రం.. విద్యాభివృద్ధి శూన్యం
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. జిల్లావాసులకు శాపం
పోటీ పరీక్షలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు లేక అవస్థలు
ఉన్నత విద్యకు దూరం
కూటమి ప్రభుత్వంపై ఆశలు
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా.. నేటికీ పూర్తిస్థాయి వసతులకు నోచుకోవడం లేదు. జిల్లాకేంద్రం కూడా అన్ని రకాలుగా వెనుబడి ఉంది. పేరుకే జిల్లాకేంద్రమైనా.. ఇక్కడ ఉన్నత విద్య కళాశాలలు.. నైపుణ్య శిక్షణ కేంద్రాలు లేకపోవడంతో గిరిజన, మైదాన ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పోటీ పరీక్షలకు సంబంధించి పార్వతీపురంలో కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ప్రతిసారీ జిల్లావాసులు వ్యయ ప్రయాసాలకు గురువ్వాల్సి వస్తోంది. నానా అవస్థలు పడి పొరుగు జిల్లాలైన విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం చేరుకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి ముందురోజు రాత్రే ఆయా జిల్లాలకు చేరుకుని పరీక్ష కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు ఉన్నత విద్య జిల్లావాసులకు అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో డిగ్రీ తర్వాత ఉన్నత విద్య కళాశాలలు లేవు. దీంతో చాలామంది చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టగా.. అతికొద్దిమంది మాత్రమే పొరుగు జిల్లాలకు వెళ్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా జిల్లాను ఏర్పాటు చేసినప్పటికీ విద్యాభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో జిల్లావాసులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 14, కేజీబీవీలు 14, , ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలు ఐదు, మోడల్ కళాశాలలు నాలుగు, ఏపీటీడబ్ల్యూఆర్ కళాశాల 9, హైస్కూల్ ప్లస్‌లు 2, ప్రైవేట్ కళాశాలలు 34 ఉన్నాయి. వాటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,849 మంది వరకూ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సుమారు 4,500 మంది చదువుతున్నారు. అయితే జిల్లాకేంద్రంలో పీజీ, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు లేవు. ఎంఈడీ వంటివి కూడా చదువుకోలేని పరిస్థితి. దీంతో ఏటా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ నుంచి రిలీవ్ అవుతున్నా.. ఉన్నత విద్యను మాత్రం అభ్యసించలేకపోతున్నారు.
- వాస్తవంగా ప్రతి జిల్లాలో కేంద్రియ విద్యాలయం ఉంటుంది. కానీ పార్వతీపురంలో మాత్రం ఆ విద్యాలయం లేదు. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు.
- పార్వతీపురంలో ప్రభుత్వ ఐటీఐ లేదు. దీంతో ఇక్కడ విద్యార్థులు పట్టణానికి సమీపంలో ఉన్న విజయనగరం జిల్లా బొబ్బిలి వెళ్లాల్సి వస్తోంది. సాలూరులో ఐటీఐ కేంద్రం ఉన్నా.. అక్కడ సరైన వసతులు లేవు. జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఐటీఐలు ఉన్నా.. ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తుండడంతో చాలామంది విద్యార్థులు వృత్తిపరమైన కోర్సులకు దూరమవుతున్నారు.
- జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ కూడా లేదు. వివిధ సాంకేతిక కోర్సులకు సంబంధించి శిక్షణ కేంద్రాలు కూడా లేవు.
- పార్వతీపురం, జియ్యమ్మవలస మండలాల్లో పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నా.. సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
- కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణాలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు.
- ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే శారీరక దారుఢ్య, పోటీ పరీక్షలకు జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. మూడేళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాలతో పాటు 15 మండలాలకు చెందిన నిరుద్యోగ యువత, సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
పోటీ పరీక్షలతో పాటు వివిధ కోర్సులకు సంబంధించి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. నిరుద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పార్వతీపురంలో వృత్తి నైపుణ్య కేంద్రాలు లేకపోవడం వల్ల ఎంతోమంది లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు.
- సీహెచ్ రమ్య, నిరుద్యోగి, పార్వతీపురం
=================
కలగా ఉన్నత విద్య
డిగ్రీ అనంతరం ఉన్నత విద్యనభ్యసించాలంటే మా లాంటి వారికి కలగా మిగిలిపోతుంది. జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలలు లేవు. దీంతో నా లాంటి ఎంతో మంది విద్యార్థులు ఆశలు వదులుకుంటున్నారు.
-ఎం.గాయత్రీ, బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని, పార్వతీపురం