వైభవంగా శ్రీరాముని రథయాత్ర
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:06 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానం వద్ద మంగళ వారం రాత్రి నవ వధూవరులు సీతారాములను ఊరేగించే రథయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు.

నెల్లిమర్ల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానం వద్ద మంగళ వారం రాత్రి నవ వధూవరులు సీతారాములను ఊరేగించే రథయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. ఏటా రామస్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాములకు తిరుక్కళ్యాణ మహోత్సవం నిర్వహించడం... నాలుగో రోజున సీతారాములను రథంపై ఊరేగించడం ఆనవాయితీ. ఈ రథాన్ని సీతారామునిపేట గ్రామస్తులు, యువకులు లాగుతుంటారు. తొలుత రథంపై సీతారాములకు ఆలయ ప్రధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, స్థానాచార్యులు గొడవర్తి నరసింహాచార్యులు, అర్చకులు కిరణ్ కుమార్, పాణంగిపల్లి ప్రసాదరావు పవన్ కుమార్, రామ్‌గోపాల్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెయిన్ రోడ్డు మీదుగా కుమ్మరి ఖానా వరకు లాగి... ఆ తర్వాత ఆలయం వరకు తీసుకువెళ్లారు. రథయాత్రను తిలకించేందుకు నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వై.శ్రీనివాసరావు, రామాలయం అర్చకులతో పాటు ఉమాసదాశివ స్వామి ఆలయ అర్చకులు రేజేటి మల్లికార్జునశర్మ తదితరులు పాల్గొన్నారు. భోగాపురం సీఐ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.