Share News

వణుకుతున్నారు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:58 PM

Shaking.. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. రాత్రికి మంచు విపరీతంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.

వణుకుతున్నారు..
విజయనగరం సమీపంలో దట్టంగా కురుస్తున్న మంచు

వణుకుతున్నారు..

జిల్లాలో పెరిగిన చలి

ఉదయం 8 గంటలైనా తగ్గని తీవ్రత

అపరాలకు పొంచి ఉన్న నష్టం

రాజాం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. రాత్రికి మంచు విపరీతంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 8 గంటల వరకూ పొగ మంచు పడుతుండడంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఇంకో వైపు వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందిపడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం, గుండె సంబంధిత ఇబ్బందులతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ 5 వేలకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకూ కాచి వడబోసిన నీటిని తాగాలని... చల్లని, నిల్వ ఆహార పదార్థాలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మంచు కురుస్తున్న సమయాల్లో బైక్‌పై ప్రయాణాలు మానుకోవాలంటున్నారు. కాగా పొగ మంచు కురుస్తుండడంతో అపరాలకు నష్టం తప్పేలా లేదు. సాధరణంగా రబీలో భాగంగా జిల్లాలో పెసర, మినుము, నువ్వు, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను రైతులు ఎక్కువగా పండిస్తారు. పొగ మంచు పడుతుండడంతో పంటలో ఎదుగుదల లేదు. నష్టం తప్పదేమోనని రైతులు భయపడుతున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:58 PM