Shortage of work for tailors కుట్టు మిషన్లు తిరగట్లే!
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:58 PM
Shortage of work for tailors: గతంలో టైలర్ల జీవితాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లేవి. ప్రతిరోజూ చేతి నిండా పని దొరికేది. ఒక డ్రెస్ కుడితే రూ.400 నుంచి వెయ్యి వరకు సంపాదించుకునే వారు. దీంతో హాయిగా జీవనం సాగిపోయేది.

- రెడీమేడ్ వస్త్రాలతో ఉపాధి దూరం
- కుటుంబ పోషణకు తప్పని ఇబ్బందులు
-ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం
జియ్యమ్మవలస, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గతంలో టైలర్ల జీవితాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లేవి. ప్రతిరోజూ చేతి నిండా పని దొరికేది. ఒక డ్రెస్ కుడితే రూ.400 నుంచి వెయ్యి వరకు సంపాదించుకునే వారు. దీంతో హాయిగా జీవనం సాగిపోయేది. ప్రస్తుతం వారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెడీమేడ్ దుస్తులు మార్కెట్లోకి ప్రవేశించడంతో టైలర్లకు పని కరువైంది. దీంతో వారి బతుకులు దయ నీయంగా మారాయి. జిల్లాలో సుమారు 10 వేల టైలర్ల కుటుంబాలు ఉన్నాయి. గతంలో సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో వీరికి చేతి నిండా పని ఉండేది. కొత్త దుస్తులను కుట్టడంలో తలమునకలయ్యే వారు. రాత్రీపగలూ పనిచేసే వారు. కొందరు దర్జీలు రోజువారి కూలీకి సహాయకుని నియమించుకునేవారు. ప్యాంటు షర్టులు, లాల్చీలు, కుర్తాలు, లంగావాణిలు, జాకెట్లు, చుడీదార్లు, లంగాలు వంటి వివిధ మోడళ్లలో కుట్టేవారు. ఆ వచ్చిన సంపాదనతో హాయిగా కుటుంబంతో జీవనం సాగించేవారు. అయితే, ప్రస్తుతం ప్రజల్లో చాలామంది క్లాత్‌లు తీసి కుట్టించుకోవడం మానేశారు. వాటికి బదులు రెడీమేడ్ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. వారికి తగ్గట్లు మార్కెట్లో వివిధ మోడళ్లలో రెడీమేడ్ డ్రెస్‌లు దొరుకుతున్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల టైలర్లకు పని ఉండడం లేదు. గ్రామాల్లో కొందరు వృద్ధులు మాత్రమే షర్టులు, లాల్చీలు కుట్టేందుకు ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పిల్లల చదువులకు ఇబ్బందిపడుతున్నామని టైలర్లు చెబుతున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో భరోసా..
గత టీడీపీ ప్రభుత్వంలో దర్జీలకు కొంత భరోసా ఉండేది. ఆసక్తి కలిగిన టైలర్లకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, లేబర్ డిపార్ట్‌మెంట్, ట్రైకార్ సంస్థ, ఐటీడీఏ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థల ద్వారా ఉచితంగా శిక్షణ అందించేవారు. శిక్షణకు హాజరైన వారికి ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తూ ఉచిత భోజనంతోపాటు ప్రతి నెల వెయ్యి రూపాయల స్టైఫండ్ కూడా ఇచ్చేవారు. దీంతో చాలామంది కుట్టులో శిక్షణ తీసుకొని రెడీమేడ్ డ్రెస్‌ల తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేవారు. మరికొందరు సొంతంగా చిన్నతరహా రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీలు పెట్టి మరికొందరికి జీవనోపాధి కల్పించేవారు. అంతేకాకుండా వసతి గృహాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పని కూడా ఆ చుట్టు పక్కల ఉన్న దర్జీలకు అప్పగించి వారికి కొంత ఆదాయం వచ్చేలా చేసేవారు. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. జగన్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కొందరికి మాత్రమే రూ.10వేలు సాయం అందించి చేతులు దులుపుకొందని దర్జీలు వాపోతు న్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు తగు ప్రోత్సాహం అందించాలని, ఉచితంగా కుట్టు మిషన్లు, బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
మా కుటుంబానికి కుట్టు మిషనే ఆధారం. కానీ, కుట్టడానికి ఎవరూ బట్టలు ఇవ్వడం లేదు. దీంతో ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-బి.గౌరీశ్వరి, మహిళ దర్జీ, బొమ్మిక, జియ్యమ్మవలస మండలం
ప్రోత్సహించాలి
2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దర్జీల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అనేక విధాలుగా ప్రోత్సహించింది. ఇప్పుడు అలాగే ప్రోత్సహించి మమ్మల్ని ఆదుకోవాలి.
-బూరి రామకృష్ణారావు, దర్జీ, పెదబుడ్డిడి, జియ్యమ్మవలస మండలం