ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు!
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:26 AM
గత వైసీపీ ప్రభుత్వం ఏఎంసీలను కేవలం ఆదాయ వనరులుగానే చూసింది. వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని సంబంధిత సిబ్బంది జీతాల కోసం వెచ్చించి మిగతాది తన ఖజానాలోకి మళ్లించుకునేది.

- ఏఎంసీల ఆదాయంలో స్థానిక సంస్థలకు కేటాయింపులు లేవు
- రాష్ట్ర ఖజానాకు మళ్లించిన వైసీపీ సర్కారు
- గత ఐదేళ్లూ ఇదే పరిస్థితి
- పాత విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం
- నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మార్కెట్ కమిటీకి భారీ ఆదాయం వస్తుంటుంది. ఈ మార్కెట్ కమిటీ పరిధిలో జాతీయ రహదారితో పాటు అంతర్ రాష్ట్ర రోడ్డు ఉండడంతో నిత్యం వరి, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాతో పాటు నిల్వ ద్వారా భారీ ఆదాయం సమకూరుతుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.80 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కొత్త వాటాను నియోజకవర్గంలోని స్థానిక సంస్థలకు చెల్లించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. రైతు అనుబంధ సేవలకు సైతం వెచ్చించలేదు. ఈ ఆదాయం మొత్తాన్ని గత వైసీపీ ప్రభుత్వం తన ఖజానాకు మళ్లించుకుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో మాదిరిగా ఏఎంసీలకు వచ్చే ఆదాయంలో కొంత వాటాను స్థానిక సంస్థలకు చెల్లించాలని ఆలోచన చేస్తోంది.
నెల్లిమర్ల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఏఎంసీలను కేవలం ఆదాయ వనరులుగానే చూసింది. వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని సంబంధిత సిబ్బంది జీతాల కోసం వెచ్చించి మిగతాది తన ఖజానాలోకి మళ్లించుకునేది. స్థానిక అవసరాలకు, రైతు సేవలకు ఒక్క రూపాయి వినియోగించిన దాఖలాలు లేవు. జిల్లాలో రాజాం, బొబ్బిలి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, పూసపాటిరేగ, చీపురుపల్లి, మెరకముడిదాంలో మార్కెట్ కమిటీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.12.29 కోట్ల ఆదాయం సమకూరినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రూ.10 కోట్ల లక్ష్యానికిగాను రూ.2 కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, వ్యవసాయ అనుబంధ రంగాల సేవల గురించి ప్రస్తావిస్తే మాత్రం మౌనమే సమాధానమవుతుంది.
ఆదాయ మార్గాలిలా..
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చెక్‌పోస్టులు, గోదాముల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమయంలో సెస్ వసూల ద్వారా ఆదాయం వస్తుంటుంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు సమయంలో అత్యధిక ఆదాయం చేకూరుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఏఎంసీల పరిధిలో ఉండే మండలాలకు కేటాయించాలి. వెనుకబడిన గ్రామాలు, పూర్తి వ్యవసాయ ఆధారిత పంచాయతీలకు ఏఎంసీ వాటా నిధులు అందించాలి. గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సీసీ రహదారులు, కాలువలు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం ఈ నిధులు కేటాయించేవారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారింది. జగన్ సర్కారు కేవలం ఏఎంసీలను ఆదాయ వనరులుగా చూసింది. తన ఐదేళ్ల పాలనలో సమకూరిన కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు మళ్లించింది. స్థానిక సంస్థలకు రావాల్సిన వాటాలను చెల్లించలేదు. అటు పాడి రైతులకు సంబంధించి పశువైద్య శిబిరాలు, సీజన్ల వారీగా పశువులకు టీకాలు, మందులు వేయ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో మాదిరిగా స్థానిక సంస్థలకు, పశు వైద్యశిబిరాలకు ఏఎంసీ నిధులు కేటాయించేందుకు సిద్ధమవుతోంది.