School Meals సరికొత్తగా బడి భోజనం
ABN , Publish Date - Feb 28 , 2025 | 11:54 PM
School Meals with a Fresh Approach జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి మధ్యాహ్న భోజన పథకం మెనూ మారనుంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల్లో మారనున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ
నేటి నుంచి అమలు
ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
గరుగుబిల్లి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి మధ్యాహ్న భోజన పథకం మెనూ మారనుంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో 1,583 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 1,18,547 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 39,903 మంది, 6 నుంచి 10వ తరగతి వరకు 54,099 మంది ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు హాజరవుతున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వారందరికీ మారిన మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మారిన మెనూ ప్రకారం.. ప్రతి సోమవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడక బెట్టిన గుడ్డు, చక్కీ అందించనున్నారు. గతంలో కూరగాయల పలావ్, గుడ్డు కూర, చక్కీ, పులిహోర, టమాటా పచ్చడి, రాగి జావ అందించేవారు. మంగళవారం అన్నం, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు అందించగా.. ఇకపై అన్నం, గుడ్డు కూర, రసం, రాగి జావ అందించనున్నారు. బుధవారం కూరగాయల అన్నం, బంగాళదుంప కుర్మ, ఉడికించిన గుడ్డు, చక్కీ అందించేవారు. ఇక మీదట వెజ్ పలావ్, బంగాళదుంప కుర్మ, ఉడికించిన గుడ్డు, చక్కీ అందిస్తారు. గురువారం సాంబార్ బాత్, ఉడికించిన గుడ్డు, పులిహోర, టమాటా చట్నీ, రాగి జావ అందించగా.. మారిన మెనూ ప్రకారం.. అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగి జావ అందించనున్నారు. శుక్రవారం ఉడికించిన గుడ్డు, చక్కీ, ఆకుకూర అన్నం, పప్పుచారు అందించేవారు. ఇకపై పులిహోర, చట్నీ, గోంగూర, తదితర కూరగాయల చట్నీ, ఉడికించిన గుడ్డు ఇవ్వనున్నారు. శనివారం తీపి పొంగలి, రాగి జావ అందించేవారు. ఇకమీదట అన్నం, కాయగూరల కర్రీ, రసం, రాగి జావ, తీపి పొంగలి అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో రక్తహీనతకు గురికాకుండా పూర్తిస్థాయి పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
జోన్-1గా ఆరు జిల్లాలు గుర్తింపు
జోన్-1లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతా రామరాజు, అనకాపల్లి జిల్లాల్లో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ అమలు చేయాలని మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు హెచ్‌ఎంలు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లకు ఆదేశాలు జారీ చేశాం. మధ్యాహ్న భోజనం నూతన మెనూ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి లోపాలు జరగకుండా చూస్తాం.
- నల్ల తిరుపతినాయుడు, డీఈవో, మన్యం జిల్లా