భయంగొల్పేలా
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:21 AM
జిల్లాలో పలు ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం చాలా రహదారుల పరిస్థితి మెరుగుపడినప్పటికీ కొన్నిరోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి.

- గోతులమయంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు
- కానరాని మరమ్మతులు
-చెల్లింపు కాని బిల్లులు
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
పార్వతీపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం చాలా రహదారుల పరిస్థితి మెరుగుపడినప్పటికీ కొన్నిరోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది 97 రహదారుల పనులకు సంబంధించి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 40 పనులు పూర్తి చేసి రూ.10 కోట్లకు సంబంధించిన బిల్లులను అప్‌లోడ్ చేశారు. కానీ, ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. వైసీపీ ప్రభుత్వ కాలంలో పార్వతీపురం-కోరాపుట్ రోడ్డు పనులను కేంద్ర నిధులు రూ.8 కోట్లతో ప్రారంభించారు. ఈ పనులను అప్పటి ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించిన ప్పటికీ నేటికీ బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ.5.54 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. సాలూరు నియోజకవర్గంలోని సాలూరు నుంచి దుగ్గేరు వయా మక్కువ రోడ్డు పనులకు రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు జగన్ సర్కారు చెప్పినప్పటికీ పనులు మా త్రం పూర్తికాలేదు. కేవలం రూ.4.5 కోట్ల విలువైన పనులు మాత్రమే చేపట్టారు. మిగిలిన పనులు పూర్తి కాలేదు. పాలకొండ నియోజకవర్గంలోని వండువ-నవగాం రహదారి మరమ్మతులకు రూ.1.50కోట్లు మంజూరై టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పనులు జరగలేదు. గత ఏడాదే నిధులు మంజూరైనప్పటికీ టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడం, అగ్రిమెంట్లు జరగకపోవడం తదితర కారణాలతో పనులు జరగలేదు. పార్వతీపురం-పాలకొండ రహదారి కూడా అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు మరమ్మతులు ఎప్పుడు పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇంజనీర్ల కొరత...
ఆర్‌అండ్‌బీ శాఖలో పూర్తిస్థాయిలో ఇంజనీర్లు లేకపోవడంతో ఆ శాఖ ద్వారా చేపట్టాల్సిన పనుల్లో జాప్యం జరుగుతుంది. 13 మంది జూనియర్ ఇంజనీర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఐదుగురు మా త్రమే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉంది. సీతంపేట, వీరఘట్టం, తోటపల్లి, మక్కువ, సీతానగరం తదితర మండలాల్లో జూనియర్ ఇంజనీర్లు లేరు. సాలూరులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉంది.
పనులు పూర్తి చేస్తాం
ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కొన్ని రహదారులకు టెండర్లు పూర్తయినా అగ్రిమెంట్లు పూర్తికాలేదు. అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అప్‌లోడ్ చేసిన వాటికి బిల్లుల చెల్లింపు త్వరలోనే జరుగుతాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-ఎస్.రామచంద్రరావు, ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్‌అండ్‌బీ