Share News

Sankranti సంక్రాంతి సందడి

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:09 AM

Sankranti Festivities జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంప్రదాయం ఉట్టిపడేలా శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది.

Sankranti  సంక్రాంతి సందడి
నృత్య ప్రదర్శనతో అలరించిన బాలికలు

  • సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు

  • అలరించిన ప్రదర్శనలు

  • పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌

పార్వతీపురం/బెలగాం/సాలూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంప్రదాయం ఉట్టిపడేలా శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది. సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంట వేశారు. ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి రంగవల్లులు తీర్చిదిద్దారు. పార్వతీపురం కలెక్టరేట్‌ ముఖద్వారం నుంచి ప్రధాన రహదారి గేటు వరకు వేసిన రంగువల్లులను కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ తిలకించారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా, వినూత్నంగా ముగ్గులు వేసిన మహిళలు, విద్యార్థినులను ఆయన అభినందించారు. జిల్లా ప్రతిష్టను పెంపొందించేలా రెండు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా వాసులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ఎన్‌.గౌరమ్మ, జి.శ్రావణి, కె.పవిత్ర తదితరులకు బహుమతులు అందించారు. స్ర్తీశిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, ఐసీడీఎస్‌ పీవో కనకదుర్గ, పార్వతీపురం ఎంఈవో విమలకుమారి, సీడీపీవోలు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తప్పెటగుళ్లు, కోలాటం ప్రదర్శనలు, టీవీ నటుడు శాంతి కుమార్‌ మిమిక్రీ , జానపద, కూచిపూడి, థింసా బృంద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ దంపతులు, సబ్‌కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాత్సవ, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు ఆయా ప్రదర్శనలను ఆద్యంతం తిలకించారు.

Updated Date - Jan 12 , 2025 | 12:09 AM