Share News

construction late ఆర్వో‘బీ లేట్‌’

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:44 PM

rob is very late చీపురుపల్లి పట్టణ నడిబొడ్డున చేపట్టిన ఆర్వోబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) పనులు నత్తనడకగా సాగుతున్నాయి. మూడేళ్లుగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణానికి స్థానికులు, మూడు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో ఏడాదైనా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

construction late ఆర్వో‘బీ లేట్‌’
సాగుతున్న బ్రిడ్జి పనులు

ఆర్వో‘బీ లేట్‌’

చీపురుపల్లిలో మూడేళ్లుగా రాకపోకలకు అవస్థలు

ముందుకు సాగని సర్వీస్‌ రోడ్ల నిర్మాణం

ఆక్రమణల తొలగింపులో అధికారుల మీనమేషాలు

చీపురుపల్లి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి పట్టణ నడిబొడ్డున చేపట్టిన ఆర్వోబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి) పనులు నత్తనడకగా సాగుతున్నాయి. మూడేళ్లుగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణానికి స్థానికులు, మూడు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో ఏడాదైనా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

2023లో బ్రిడ్జి పనులు మొదలు పెట్టినప్పటికీ 2022 మే నుంచి పాత బ్రిడ్జి వినియోగంపై నిషేధం విధించారు. అయితే పనులు ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకో యేడాదైనా అందుబాటులోకి వస్తుందా అన్నది సందేహంగానే ఉంది. 1964లో నిర్మించిన పాత బ్రిడ్డి కాలపరిమితి ముగిసిందని, వినియోగానికి పనికిరాదని ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వడంతో దీని స్థానంలో కొత్తది నిర్మించడానికి రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.12.98 కోట్లు మంజూరు చేసింది. 2023 మార్చిలో రైల్వే శాఖ పనులు ప్రారంభించింది. బ్రిడ్జి పనులకు ఓ రూపం వచ్చినప్పటికీ ఇరువైపులా అనుసంధానంగా ఉండాల్సిన సర్వీసు రోడ్ల నిర్మాణంలో పలు సమస్యలు ఎదురవుతుండడం నూతన బ్రిడ్జి నిర్మాణానికి అవరోధంగా మారింది. వాస్తవానికి హౌరా-చెన్నై ప్రధాన రైల్వే లైను చీపురుపల్లి పట్టణానికి మధ్య నుంచి వెళ్తోంది. దీంతో ఇటు విజయనగర, అటు శ్రీకాకుళం జిల్లాలకు, పాలకొండ, కొత్తూరు తదితర ప్రాంతాలకు కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. అంతే కాకుండా చీపురుపల్లి పట్టణ పరిథిలోని జి.అగ్రహారం, రిక్షాకాలనీ, గరివిడి మండలంలోని కొండలక్ష్మిపురం వంటి ప్రాంతాలకు వెళ్లడానికి ఈ బ్రిడ్జి, దీనికి ఆనుకొని ఉన్న సర్వీసు రోడ్లే ఆధారం. ఈ కారణంగా బ్రిడ్జి నిర్మాణం ఎంత అవసరమో, సర్వీసు రోడ్ల నిర్మాణం కూడా అంతే అవసరం. తమ ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తయినంత వరకూ బ్రిడ్జి పనులు సాగనివ్వబోమని రిక్షా కాలనీ, కొత్తగ్రహారం, జి.అగ్రహా రంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారు గత కొంత కాలంగా పట్టుబడుతు న్నారు. అయితే సర్వీసు రోడ్లు నిర్మించాల్సిన స్థానంలో ఇరు వైపులా నివాసాలు, దుకాణాలు ఉండడంతో వాటి తొలగింపు కూడా సమస్యగా మారింది. సర్వీసు రోడ్ల నిర్మాణం వల్ల తమకు తీవ్రంగా నష్టం ఏర్పడుతుందని, దుకాణాలు పోయి, తమ బతుకులు రోడ్డున పడతాయని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారు ఆవేదన చెందుతున్నారు.

- ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఇప్పటికే స్థానికుల్ని కలిసి మాట్లాడా రు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారని, అయినప్పటికీ పూర్తిగా తొలగించ కుండా బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మాత్రమే అడుగుతున్నామని నచ్చజెప్పారు. ఈ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆక్రమణల తొలగింపు పూర్తి కాలేదు. ఆర్వోబీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాజాం, పాలకొండ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు మూడేళ్లుగా వేరే మార్గంలో తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి పెట్టి ఆర్వోబీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:44 PM