తిరుగు పయనం
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:49 PM
సంక్రాంతి పండుగ కోసం సొంతూరికి వచ్చినవారు తిరుగు పయనమయ్యారు.

విజయనగరం జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ కోసం సొంతూరికి వచ్చినవారు తిరుగు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసి పోయాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు భోగికి ఒక రోజు ముందే ఊరికి వచ్చారు. నాలుగు రోజుల పాటు మిత్రులు, బంధువులతో సంతోషంగా గడిపారు. కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. బంధువులకు వీడ్కోలు పలుకుతూ గురువారం బయలుదేరారు. దీంతో జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు రద్దీగా కనిపించాయి. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి తదితర ప్రాంతాల వారికి బస్సులు, రైళ్లు అందు బాటులో ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వందలాది కిలోమీటర్ల నుంచి వచ్చిన కొందరు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. ప్రమాదమని తెలిసినా.. తప్ప డం లేదు. ఆర్టీసీ బస్‌స్టేషన్లలో బస్సులు సమయానికి రాక, సీట్లు లేక చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ రెట్టింపు ధరలు వసూలు చేశారు.