Share News

Excise Department: పదవీ విరమణ చందాలంట!

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:12 AM

Excise Department:అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు.

Excise Department:   పదవీ విరమణ చందాలంట!

- ఎక్సైజ్‌ శాఖలో వసూలు రాజాలు

- కొన్ని నెలల్లో రిటైర్‌ కానున్న ఓ అధికారి

- ఈలోపే అందినకాడికి కలెక్షన్ల పర్వం

- ఇవ్వాలంటూ మద్యం వ్యాపారులకు హుకుం

-రంగంలోకి దిగిన కిందిస్థాయి ఉద్యోగులు

అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ఎక్సైజ్‌శాఖలోని కొంతమంది అధికారులు నూతన మద్యం విధానాన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వారికి నెలవారీగా అందుతుండగా.. తాజాగా పదవీ విరమణ చందాల పేరిట రంగంలోకి దిగారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఓ అధికారి ఆదేశాలతో కొందరు సిబ్బంది మద్యం వ్యాపారులను డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.


విజయనగరం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎక్సైజ్‌ శాఖకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జవసత్వాలు వచ్చాయి. 2019కి ముందు ఉన్న యథాస్థితిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎక్సైజ్‌శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మద్యం విధానాన్ని కూడా రద్దు చేసి నూతన పాలసీని తీసుకువచ్చింది. దానిలో భాగంగా మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యాపారులు దక్కించుకున్నారు. అయితే ఎక్సైజ్‌శాఖలోని కొంతమంది అధికారులు నూతన మద్యం విధానాన్ని అవకాశంగా తీసుకుని భారీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జిల్లాలో ఉన్నాయి.


జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 10 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 177 మద్యం దుకాణాలు, 28 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చి మద్యం దుకాణాలు ఏర్పాటైన రెండు నెలల్లోనే ఎక్సైజ్‌ శాఖ అధికారులు అక్ర మాలకు తెరలేపినట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లా ఎక్సైజ్‌ శాఖలోని ఒక అధికారి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో ఆయన వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పదవీ విరమణ చేసేలోపే అందినకాడికి తీసుకోవాలన్న తాపత్రయంతో ఉన్నట్లు సమాచారం. ప్రతి మద్యం దుకాణం, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నుంచి డబ్బులు వసూలు చేసి తనకు అందించాలని ఎస్‌హెచ్‌వోలకు అనధికారికంగా హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే దీనికి ఇద్దరు, ముగ్గురు స్టేషన్‌ అధికారులు తలూపగా, మిగతా అధికారులు అయిష్టంగానే ఉన్నట్లు తెలిసింది. వారు మద్యం వ్యాపారుల వద్దకు వెళ్లి పదవీ విరమణ చందాల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మద్యం అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, కనీస లాభాలు కూడా రావడం లేదని.. అయినా ప్రతినెలా ఎక్సైజ్‌ సిబ్బందికి ఇస్తున్నామని కొందరు మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు పదవీ విరమణ చందాల పేరిట వసూళ్లకు పాల్పడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తం అంటే ఎక్కడ నుంచి తీసుకురాగలమని వాపోతున్నట్లు తెలిసింది.


ఎప్పుడూ జరిగేదే..

ఎక్సైజ్‌ అధికారుల అక్రమ వసూళ్లు అనేది ఎప్పుడూ ఉండేదే. రికార్డులు, పునరుద్ధరణ పేరిట గతంలో మాదిరి ఇప్పుడూ జరుగుతుంది. పదవీ విరమణ చందా అంటూ ఎవరూ అడగలేదు. కానీ ఇతరత్రా వాటికి వసూళ్లు చేస్తున్నారు.

- ఓ మద్యం వ్యాపారి

తప్పడం లేదు..

మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే పండగ, నెలవారి మామూళ్ల పేరిట ఎక్సైజ్‌ అధికారులకు డబ్బులు ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో దుకాణాలు కుదరక ముందే వసూళ్లు అంటూ కొన్ని అధికారులు, సిబ్బంది వస్తున్నారు. ప్రస్తుతం దుకాణాల నిర్వహణ కష్టంగా ఉంది. అయినా మామూళ్లు ఇవ్వడం తప్పడం లేదు.

- మద్యం వ్యాపారి, బొబ్బిలి డివిజన్‌

అక్రమ వసూళ్ల ఊసేలేదు

జిల్లాలో అక్రమ వసూళ్లకు తావులేదు. సిబ్బందిని, ఎస్‌హెచ్‌వోలను వసూళ్లు చేయమని ఏ ఉన్నతాధికారి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి కొద్ది రోజులే అవుతుంది. దుకాణదారులు కుదురుకోవడానికి సమయం పడుతుంది.

- బాబ్జీరావు, డిప్యూటీ కమిషనర్‌, ఎక్సైజ్‌ శాఖ

Updated Date - Jan 25 , 2025 | 12:12 AM