రీసర్వే కష్టాలు తీరట్లే!
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:12 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం కాకపోగా మరిన్ని ఎక్కువయ్యాయి.

- ఇంకా పరిష్కారం కాని భూ సమస్యలు
- రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న భూ యజమానులు
బొబ్బిలి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం కాకపోగా మరిన్ని ఎక్కువయ్యాయి. రీసర్వే చేసి రైతులకు సర్వే నెంబర్లకు బదులుగా కొత్తగా ఎల్‌పీఎం నెంబర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడ లేని తలనొప్పులన్నీ రైతులకు వచ్చి పడ్డాయి. భూముల రీసర్వే అనంతరం ఆన్‌లైన్ చేసే విధానంలో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొంతమందికి భూములు తక్కువగాను, మరికొందరికి ఉన్న భూమి కంటే ఎక్కువగాను రావడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాకుండా తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న జిరాయితీ భూములను సైతం బంజరు, డి.పట్టా, గయాళి, పోరంబోకు వంటి పేర్లతో కొత్తగా రికార్డుల్లో చూపిస్తుండడంతో రైతులు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాలు, జిల్లా కలెక్టరు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఊళ్లకు ఊళ్లే ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. బొబ్బిలి డివిజన్‌లో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. దీని ఫలితంగా రైతులు తమ పిల్లల వివాహాలు, చదువులు, ఇతర అవసరాల కోసం భూములను అమ్ముకుందామంటే ‘ఈ భూమి నీది కాదని’ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో చెబుతుండడంతో బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రీసర్వే తప్పులను సరి చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. అయితే, భూసమస్యలను 70 రోజుల్లోగా పరిష్కరిస్తామని అధికారులు చెప్పినా ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
గయాళి భూమి అని రికార్డుల్లో ఉంది
బొబ్బిలి సరిహద్దు గ్రామం బాడంగి మండలం గొల్లాది రెవెన్యూలో సర్వేనెంబరు 202/1 నుంచి 202/ 18 వరకు ఉన్న 3.73 ఎకరాలను 2011లో సామిరెడ్డి సూరిబాబు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్ చేయించుకున్నాం. ఆయన బొబ్బిలి కృష్ణ దగ్గర 2007లో కొనుగోలు చేసి మాకు విక్రయించాడు. ఇవన్నీ రిజిస్ర్టేషన్ ద్వారా సంక్రమించినవే. 2019లో మేము ఈ భూములను పరస్పరం తర్జుమా చేసుకున్నాం. ఆ తరువాత జగన్ ప్రభుత్వంలో రీసర్వేతో భూముల రికార్డులు తారుమారయ్యాయి. తాజాగా 1బీ రికార్డు తీయిస్తే ఒక కాలమ్‌లో వారసత్వపరంగా సంక్రమించిన భూమి అని చెబుతూనే మరో పక్క గయాళి అని కనిపిస్తోంది. ఈ రికార్డులు చూసి మేము షాక్ అయ్యాం. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మాకు స్పష్టమైన హామీ రావడం లేదు. పరిష్కారం కనిపించడంలేదు. అధికారుల మధ్య పూర్తిగా సమన్వయం కొరవడింది. మరికొంతమంది ఉద్యోగులకు ఎటువంటి అవగాహన కూడా లేకపోవడంతో మాలాంటి వారమంతా చాలా నష్టపోతున్నాం. దీనికి పరిష్కారం దొరికే మార్గం తెలియక నానా అవస్థలు పడుతున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో వ సమస్య తీరిపోతుందని అనుకున్నాం. రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా భూ సర్వే బాధితులందరికీ పూర్తి న్యాయం చేయాలి.
- బూర అప్పారావు, వెంకటరమణ, బొబ్బిలి
ప్రభుత్వ భూమి అంటున్నారు..
మా గ్రామ రెవెన్యూ పరిధిలో మా కుటుంబ సభ్యులందరికీ చాలా తరాల నుంచి జిరాయితీ భూమి ఉంది. ఈ భూమిలో సుమారు ఎకరా భూమిని మా ఆర్థిక అవసరాల కోసం అమ్మేశాం. తీరా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే ఈ భూమి జిరాయితీ కాదు.. 22ఏ లో ఉందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారు. సుమారు ఏడాది నుంచి తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకు తిరుగుతూనే ఉన్నాం. సమస్య తీరిపోతుందని అంటున్నారే తప్ప పని జరగడంలేదు. భూసర్వేతో రికార్డులు తారుమారయ్యాయి. వాటిని వెంటనే సరి చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది.
-కర్రోతు మోహనరావు, శిష్టు సీతారాంపురం, రామభద్రపురం మండలం