Elephant Conflict ఏనుగుల సమస్యను పరిష్కరించండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:11 PM
Resolve the Elephant Conflict పార్వతీపురం మన్యం వాసులను దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. గజరాజుల కారణంగా జిల్లావాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు.

కురుపాం/గుమ్మలక్ష్మీపురం/కొమరాడ, మార్చి5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం వాసులను దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. గజరాజుల కారణంగా జిల్లావాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘మన్యం’లో మొత్తంగా 11 ఏనుగులు సంచరి స్తున్నాయని తెలిపారు. వాటివల్ల కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో 12 మంది మృతి చెందారని, వేలాది ఎకరాల్లో పంటలను రైతులు నష్టపోయారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఏనుగుల సమస్యను పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. ప్రస్తుతం జనా వాసాల్లో, రహదారులపై గజరాజులు గుంపుగా సంచరిస్తుండడం వల్ల ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాలేకపోతున్నారని, పొలాలకు వెళ్లేందుకు కూడా సాహసించలేకపోతున్నారని తెలిపారు. వాహనదారులు కూడా రాకపోకలు సాగించలేకపోతున్నారని వెల్లడించారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో జిల్లావాసులు నిత్యం భయబ్రాంతలకు గురువుతున్నారని చెప్పారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు గజరాజుల బెడద తప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంబంధిత మంత్రికి ఈ విషయం తెలియజేస్తామన్నారు.