Bills నీరు-చెట్టు బిల్లులకు మోక్షం
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:35 PM
Relief for Water and Tree Bills గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసిన వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.

చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
పార్వతీపురం, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసిన వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవంగా చెరువుల అభివృద్ధిలో భాగంగా గతంలో టీడీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలు ఈ పనులు చేపట్టారు. అప్పట్లో నామినేషన్ పద్ధతిపై కొన్ని పనులు, ఇరిగేషన్ శాఖ ద్వారా మరికొన్ని చేపట్టారు. అయితే ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. నీరు-చెట్టు పనులు చేపట్టిన వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బిల్లుల చెల్లింపులకు చొరవ చూపలేదు. దీంతో అప్పులు చేసి పనులు చేసిన టీడీపీ సానుభూతిపరులు, కాంట్రాక్టర్లు మరింతగా కుదేలయ్యారు. బకాయిల కోసం వారు అప్పట్లో కార్యాలయాలు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అభివృద్ధి పనులు చేపట్టిన వారికి బిల్లులు చెల్లించాలని ఇరిగేషన్‌శాఖను ఆదేశించింది. దీంతో అప్పట్లో సుమారు రూ.14 కోట్ల వరకు బిల్లులు చెల్లింపులయ్యాయి. అయితే కోర్టుకు వెళ్లలేని వారికి మాత్రం ఏమీ అందలేదు. అయితే ఇటువంటి వారి సమస్యలను కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తక్షణమే బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.9 కోట్ల మేర పెండింగ్ బిల్లులకు మోక్షం లభించనుంది. కాగా అప్పట్లో ఉమ్మడి జిల్లా పరిధిలో నీరు-చెట్టు పనులు జరగ్గా.. ఇరిగేషన్‌శాఖ ద్వారా కాంట్రాక్టర్లకు త్వరలోనే బిల్లులు చెల్లించనున్నారు. సర్కారు తాజా నిర్ణయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్రియ చేపడతాం..
జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల పరిధిలో నీరు-చెట్టు పనులకు సుమారు రూ.9 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే చెల్లింపు ప్రక్రియ చేపడతాం.
- అప్పలనాయుడు, జిల్లా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారి