Share News

Ration rice: రేషన్‌ బియ్యం పక్కదారి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:32 AM

Ration rice: జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు వ్యాపారులు పేదల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒడిశా, ఛత్తీస్‌గడ్‌కు తరలిస్తున్నారు.

Ration rice: రేషన్‌ బియ్యం పక్కదారి

- రూటుమార్చిన అక్రమార్కులు

- కాకినాడ పోర్టుకు కాకుండా ఒడిశా, ఛతీ్త్‌సగఢ్‌కు రవాణా

- రీసైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తున్న మిల్లర్లు

- లెవీగా చూపిస్తున్న మరికొందరు

- జిల్లాలో నడుస్తోన్న పెద్ద నెట్‌వర్క్‌

- పట్టించుకోని అధికారులు

విజయనగరం ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు వ్యాపారులు పేదల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒడిశా, ఛత్తీస్‌గడ్‌కు తరలిస్తున్నారు. అక్కడ పౌలీ్ట్ర వ్యాపారులకు అధిక ధరకు విక్రయించి భారీగా అర్జిస్తున్నారు. గతంలో ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించేవారు. పోలీస్‌ నిఘా పెరగడంతో వారు రూటుమార్చారు. ప్రస్తుతం కాడినాడకు కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గడ్‌కు ప్రతినెలా వందల లారీల్లో బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు మిల్లర్లు ఈ బియ్యాన్నే ప్రభుత్వానికి లెవీగా చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు మిల్లర్లు రీ సైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. దీనికోసం జిల్లాలో పెద్ద నెట్‌వర్క్‌ పని చేస్తోంది.


25vzp2.gif

- ఈ నెల 8న జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.వెంకటరావు ఇంట్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డిప్యూటీ తహసీల్దార్‌ ఎన్‌వీఎస్‌ మూర్తి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సింహాచలం తనిఖీలు చేపట్టి 10 క్వింటాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. వెంకటరావుపై 6ఏ కేసు నమోదు చేసి బియ్యాన్ని సీజ్‌ చేశారు.

ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- గత నెల 10న బలిజిపేట మండలం వెంగళరాయపురం జంక్షన్‌ వద్ద ఓ వ్యాన్‌లో 48 సంచుల్లో తరలిస్తున్న 2,300 క్వింటాల రేషన్‌ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వ్యాన్‌తో పాటు బియ్యాన్ని సీజ్‌ చేశారు.

-గత నెల 23న శృంగవరపుకోట మండలం పోతనాపల్లి వద్ద ఆటోలో తరలిస్తున్న 7 క్వింటాల రేషన్‌ బియ్యాన్ని వీఆర్వో సముద్రం స్వాధీనం చేసుకున్నారు. ఆటోను, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై 6-ఏకేసు నమోదు చేశారు.

- గత ఏడాది సెప్టెంబరులో బుదరాయివలస పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.17 లక్షల విలువచేసే 376 టన్నుల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. విజిలెన్స్‌ అధికారులు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 14 కేసులు నమోదు చేసి 33 మందిని అరెస్టు చేశారు. మొత్తం రూ.46.38 లక్షల విలువైన 1,019 టన్నుల బియ్యం పట్టుకున్నారు.


జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి ప్రతినెలా అందించేందుకు 9,159 టన్నుల రేషన్‌ బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. అయితే, రేషన్‌ తీసుకుంటున్న వారిలో 25 శాతం మంది బియ్యాన్ని వినియోగించడం లేదు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నా రు. చిరు వ్యాపారులు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పేదల నుంచి కిలో బియ్యాన్ని రూ.13 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్నారు. వారు ఈ బియ్యాన్ని మిల్లర్లకు కేజీ రూ.20కు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతోనే చిరు వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకూ కమీషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ బియ్యాన్ని మిల్లర్లు లెవీకి చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు మిల్లర్లు రీ సైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్‌ బియ్యాన్ని సాంబమసూరి వంటి బ్రాండెడ్‌ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు.

16 మంది దళారులు..

రేషన్‌ బియ్యం దందాలో జిల్లాలో 16 మంది వరకు దళారులు ఉన్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి దందా ఓ రేంజ్‌లో కొనసాగింది. అప్పట్లో జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. వారికి అప్పట్లో వైసీపీ పెద్దలు అండగా నిలిచేవారన్న విమర్శలు ఉన్నాయి. వారంతా గ్రామాల్లో మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని బియ్యాన్ని సేకరించేవారు. ప్రతినెలా వేల క్వింటాలను కాకినాడ పోర్టుకు తరలించేవారు. ఇప్పటికీ వారి దందా అలానే కొనసాగుతోంది. అయితే, గతంలో మాదిరిగా కాకినాడ పోర్టుకు తరలించలేకపోతున్నారు. పోలీస్‌ నిఘా పెరగడంతో రూటుమార్చారు. ఒడిశా, చత్తీస్‌గడ్‌కు రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బియ్యాన్ని నూకలుగా చేసి అక్కడి పౌలీ్ట్ర పరిశ్రమల్లో కోళ్ల దాణాకు, ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా వందల లారీల్లో బియ్యం ఒడిశాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విజిలెన్స్‌ దాడుల్లో ఇదే విషయం తేలింది.

సన్న బియ్యంగా చేసి..

సాధారణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు ఏడాది పొడవునా మిల్లింగ్‌ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఇందుకుగాను క్వింటా మిల్లింగ్‌ చేసేందుకు ప్రభుత్వం రూ.60 చెల్లిస్తుంది. అయితే ఇక్కడే కొందరు మిల్లర్లు దగా చేస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని నేరుగా లెవీగా చూపుతున్నారు. చిరు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేయించిన బియ్యాన్నే మిల్లింగ్‌ చేసిన బియ్యంగా చూపుతున్నారు. రూ.25 నుంచి రూ.30 వరకూ రేషన్‌ బియ్యాన్ని చూపి లెవీకి పంపుతున్నారు. బస్తా దగ్గర రూ.30ల వరకూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్‌ బియ్యాన్ని సాంబమసూరి వంటి బ్రాండెడ్‌ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. సన్నంగా మరపట్టడంతో వినియోగదారులు సైతం గుర్తించలేక మోసపోతున్నారు. అటు తూకం దగ్గర సైతం ఇదే పరిస్థితి. 25 కిలోలు ఉండే ప్యాకెట్‌లో ఉండేది 23 కిలోలే. రెండు కిలోలు తరుగును చూపిస్తుంటారు. ఇటు బియ్యం నకిలీతో పాటు తూకంలో సైతం వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతలు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

దృష్టిపెట్టాం..

జిల్లాలో బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంపై దృష్టిపెట్టాం. ఇప్పటికే విజిలెన్స్‌ బృందాలు తిరుగుతున్నాయి. అక్రమంగా రేషన్‌ నిల్వచేసినా నేరమే. మిల్లర్లు సైతం జాగ్రత్తగా ఉండాలి. నిల్వల్లో తేడావస్తే కఠినచర్యలు తప్పవు. మరింత నిఘా పెంచుతాం. రేషన్‌ పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపడతాం.

-మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరా అధికారి, విజయనగరం

Updated Date - Feb 26 , 2025 | 12:32 AM