Secretariats: సచివాలయాలు ప్రక్షాళన
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:36 AM
Secretariats:సచివాలయాల సమూల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. పూర్తిగా ప్రజోపయోగ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించాలని భావిస్తోంది.
- ఉద్యోగుల సర్దుబాటు
-మూడు విభాగాలుగా రేషన్‌లైజేషన్
-సేవలు సరళతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- ఉత్తర్వులు జారీ
విజయనగరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సచివాలయాల సమూల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. పూర్తిగా ప్రజోపయోగ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించాలని భావిస్తోంది. ఉద్యోగుల హేతుబద్ధీకరణతోనే అది సాధ్యమని నమ్మి గ్రామ/వార్డు సచివాలయాలను మూడు విభాగాలుగా(ఏ,బీ,సీ) విభజించనుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. 2019 అక్టోబరు 2న వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రతి సచివాలయంలో 11 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది. జిల్లా బోర్డు ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టింది. ప్రజలకు స్థానికంగా సేవలందించే పేరిట భారీగా ఉద్యోగులను నియమించింది. అందులో కొందరికి పని తక్కువగా ఉండగా.. మరికొందరిపై విపరీతంగా భారం పడుతోంది. ధ్రువపత్రాల జారీలో డిజిటల్, వెల్ఫేర్ కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తారు. వీరి సంఖ్య తక్కువగా ఉంది. మరికొన్నిచోట్ల అయితే చాలాశాఖలకు సంబంధించి కార్యదర్శులకు పనిలేకుండా ఉంది. ఉదాహరణకు మత్స్యకారులు లేని సచివాలయాల్లో మత్స్యశాఖకు సంబంధించిన కార్యదర్శులను నియమించారు. వారికి ఎటువంటి పనిలేకుండా పోయింది. అటువంటి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో 778 సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం పోస్టులు 6,567 ఉన్నాయి. కానీ 6,181 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా ఉద్యోగుల లోటు ఉంది. చాలాచోట్ల ఎక్కువగాను.. మరికొన్నిచోట్ల తక్కువగాను సిబ్బంది ఉన్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో సిబ్బంది సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం హేతుబద్ధీకరణకు దిగింది. పలుచోట్ల సాంకేతిక సహాయకులు లేకపోవడంతో ఆ పనిని వెల్ఫేర్ అసిస్టెంట్లు చేస్తున్నారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంజినీరింగ్, డిప్లమో, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారు ఉన్నారు. వీరి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సచివాలయ ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించింది. వారి సీఎంఎఫ్‌ఎస్ ఐడీ, సెల్‌ఫోన్ నంబరు, విద్యార్హత, కులం, ఉపకులం వివరాలు సేకరించారు. బీటెక్, ఎంటెక్, ఈసీఈ, మెకానికల్, సివిల్, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారి సమాచారం తీసుకున్నారు. ఉద్యోగుల రేషన్‌లైజేషన్‌లో ప్రభుత్వం ప్రజా అవసరాల మేరకు వీరి సేవలను వినియోగించుకోనుంది. జిల్లాలోని సచివాలయాల్లో 200 మంది వరకూ ఉన్నత విద్యావంతులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏ,బీ,సీలుగా విభజన..
సచివాలయ ఉద్యోగులను ఏ,బీ,సీ విభాగాలుగా (మల్టీపర్సస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు) విభజించారు. ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఏ కేటగిరికి సంబంధించి 2,500 జనాభా లోపు ఉండే సచివాలయాల్లో ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీలు, నలుగురు టెక్నికల్ ఆస్పరేషనల్ ఫంక్షనరీలు ఉంటారు. బి సెక్షన్‌కు సంబంధించి 2,500 నుంచి 3,000 జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు మల్టీపర్సస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు. సి సెక్షన్‌కు సంబంధించి మూడు వేలకుపైగా జనాభా ఉన్న సచివాలయాల్లో నలుగురు మల్టీపర్పస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీలు ఉంటారు. అదే సమయంలో ప్రభుత్వం ఇటీవల డ్రోన్లతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వాటి బాధ్యతలను సైతం అప్పగించే చాన్స్ ఉంది.
గ్రామ సచివాలయాల్లో మల్టీపర్పస్ ఫంక్షనరీల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్‌తో పాటు మహిళా పోలీసులు ఉంటారు. వార్డు సచివాలయానికి అడ్మిన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు.
గ్రామ సచివాలయాల్లో టెక్నికల్ ఫంక్షనరీలకు వీఆర్వో, ఏఎన్‌ఎం, సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయం, పశుసంవర్ధక ఎనర్జీ కార్యదర్శి ఉంటారు. వార్డు సచివాలయాల్లో రెవెన్యూ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి, ఎమినిటీస్, శానిటరీ, ఎనర్జీ కార్యదర్శులు ఉంటారు.