Share News

Girls' Rights బాలికల హక్కులను పరిరక్షించాలి

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:39 PM

Protecting Girls' Rights బాలికల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం పార్వతీపురంలోని లయన్స్‌ కల్యాణ మండపంలో బేటీ బచావో...బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Girls' Rights బాలికల హక్కులను పరిరక్షించాలి
సైకిళ్ల పంపిణీలో మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): బాలికల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం పార్వతీపురంలోని లయన్స్‌ కల్యాణ మండపంలో బేటీ బచావో...బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డ అంటే భారం కాదని.. బలమైన ధైర్యవంతురాలని తెలిపారు. బాలికలు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాక్షించారు. జిల్లాలో బాలికల వసతిగృహం, పాఠశాలల్లో తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వన్‌స్టాప్‌ సెంటర్‌, బాలసదన్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 220 మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4 వేల చొప్పున సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌, అనాఽథ పిల్లలకు ఆర్థిక సాయం, గర్భిణులు, బాలింతలకు అమృత ఆహార కిట్లు పంపిణీ చేశారు. బేటీ బచావో...బేటీ పడావో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సామూహిక సీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు అన్న ప్రసాదం అందించారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తదితరులతో కలిసి మంత్రి సైకిల్‌ తొక్కి అందర్నీ ఉత్సాహ పరిచారు. అమ్మాయిలను బాగా చదివించి ఉన్నత శిఖరాలు చేరుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి సూచించారు. మహిళా శక్తిని మరింత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. ఆడపిల్లలకు చదువు తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి టి.కనకదుర్గ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ చిన్మయదేవి, ట్రైకార్‌, కాపు, కొప్పల వెలమ కార్పొరేషన్‌ సంచాలకులు లావణ్య, రామినాయుడు, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:39 PM