Cashew జీడికి ప్రోత్సాహం?
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:07 AM
Promotion of Cashew Cultivation సీతంపేట ఏజెన్సీలో ఎక్కువగా పండే పంటల్లో ప్రధానమైనది జీడి. వేలాది ఎకరాల్లో గిరిజనులు పండించే జీడికి డిమాండ్ ఎక్కువ. మైదాన ప్రాంతంతో పోలిస్తే .. ఇక్కడ పండే జీడికి రుచి, పిక్క సైజు అధికం. అందుకే మద్దతు ధర కూడ ఆశించిన స్థాయిలోనే పలుకుతుంది. అందుకే ఏజెన్సీలో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

పార్వతీపురంలో స్థల పరిశీలన
సీతంపేటలో పరిస్థితేమిటో..
ఇప్పటికే మూతపడ్డ కేంద్రం
పట్టించుకోని అధికారులు
సీతంపేట రూరల్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో ఎక్కువగా పండే పంటల్లో ప్రధానమైనది జీడి. వేలాది ఎకరాల్లో గిరిజనులు పండించే జీడికి డిమాండ్ ఎక్కువ. మైదాన ప్రాంతంతో పోలిస్తే .. ఇక్కడ పండే జీడికి రుచి, పిక్క సైజు అధికం. అందుకే మద్దతు ధర కూడ ఆశించిన స్థాయిలోనే పలుకుతుంది. అందుకే ఏజెన్సీలో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పటికే జిల్లేడుపాడు గ్రామంలో మూతపడిన యూనిట్‌ను అధికారులు వదిలేస్తారా, లేక వినియోగంలోకి తీసుకొస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లేడుపాడులో 2011లో సీతంపేట ఐటీడీఏ సహకారంతో జీడిపప్పు తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. నవోదయ మహిళా స్వయంశక్తి సంఘం ఆధ్వర్యంలో ఈ యూనిట్ సుమారు ఐదేళ్ల పాటు మంచి లాభాల బాటలో నడిచింది. ఈ ప్రాంతంలో తయారు చేసిన జీడిపప్పును హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వంటి నగరాలకు ఎక్స్‌పోర్ట్ అయ్యేది. దీని ద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యులకు మంచి ఆదాయం చేకూరేది. అయితే యూనిట్ నిర్వహణ భారమై గడచిన ఏడేళ్లుగా మూతపడింది. ఇక్కడున్న యంత్రాలను వెలుగు అధికారులు సీతంపేటలోని ఐటీడీఏకు సమీపంలో వన్‌ధన్ వికాస్ కేంద్రానికి తరలించారు. జీడి పిక్కల బోయలింగ్ యంత్రం మరమ్మతులకు గురవ్వడంతో బయటపడేశారు. మొత్తంగా వెలుగు అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ, సహకారం లోపం కారణంగా జీడి ప్రాసెసింగ్ యూనిట్ మూతపడింది.
పార్వతీపురంలో ...
పార్వతీపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం స్థల పరిశీలన చేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆర్టికల్ 275 (1) కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. కాగా పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో యూనిట్ స్థాపనకు గల పరిస్థితులను పీవో పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో ఎ.మురళీధర్, డీఆర్‌డీఏ పీడీ సత్యంనాయుడు తదితరులున్నారు.
వెలుగు సీసీ ఏమన్నారంటే..
జిల్లేడుపాడులో నవోదయ మహిళా స్వయంశక్తి సంఘం సభ్యుల ఆధీనంలో ఉన్న జీడి ప్రోసెసింగ్ యూనిట్‌ను తాను గతంలోనే పరిశీలించానని వెలుగు సీసీ వెంకటనాయుడు చెప్పారు. ఆ గ్రూప్ సభ్యుల్లో కొందరు వయోభారం కారణంగా ఈ కేంద్రాన్ని నడపలేక మూసివేసినట్లు తెలిపారు.
చాలా ఖర్చుచేశాం..
జిల్లేడుపాడులో నెలకొల్పిన జీడి ప్రోసెసింగ్ యూనిట్‌ను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. యంత్రాలు మరమ్మతులకు గురైతే.. మా సొంత డబ్బులతో రిపేరు చేయించుకున్నాం. ఎవరి సహకారం లేకపోయినప్పటికీ సంఘంలో ఉన్న డబ్బుతో కొంతకాలం యూనిట్‌ను నిర్వహించాం. మిషనరీస్ పాతబడి పోవడంతో పాటు తరుచూ మరమ్మతులకు గురవుతుండేవి. దీంతో చేసేది లేక ఈ కేంద్రాన్ని మూసివేశాం.
- నారాయణమ్మ, నవోదయ మహిళా స్వయంశక్తి సంఘం అధ్యక్షురాలు
===============================
సహకారం లేక..
జిల్లేడుపాడులో జీడి ప్రోసెసింగ్ యూనిట్ ప్రారంభించిన తొలినాళ్లలో వ్యాపారం బాగానే ఉండేది. అయితే ఐటీడీఏ, వెలుగు నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు. దీంతో జీడి ప్రోసెసింగ్ యూనిట్‌ను మూసివేయాల్సి వచ్చింది. మమ్మల్ని అధికారులు ప్రోత్సహిస్తే.. కొత్తగా గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోని మళ్లీ జీడి ప్రోసెసింగ్ యూనిట్‌ను నిర్వహించుకుంటాం.
-హెచ్ జానకి, స్వయంశక్తి సంఘం సభ్యురాలు