Share News

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:27 AM

‘రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులు రాజాంకు ఏం చేశారు. ఊరికో అబద్ధం.. వీధికో అబద్ధం చెప్పి ఒక్క చాన్సంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అడుగులో అడుగు వేసిన జోగులు మనకు అవసరమా?. రాజాం-డోలపేట మధ్య కిలోమీటర్‌ రోడ్డును కూడా బాగుచేయలేకపోయారు.

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..
రాజాం-డోలపేట రహదారి

- రాజాంలో జరిగిన లోకేశ్‌ శంఖారావం సభకు ఏడాది పూర్తి

- కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని

అప్పట్లో హామీ ఇచ్చిన యువనేత

- చెప్పినట్లే రూ.100 కోట్లతో పనులు

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులు రాజాంకు ఏం చేశారు. ఊరికో అబద్ధం.. వీధికో అబద్ధం చెప్పి ఒక్క చాన్సంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అడుగులో అడుగు వేసిన జోగులు మనకు అవసరమా?. రాజాం-డోలపేట మధ్య కిలోమీటర్‌ రోడ్డును కూడా బాగుచేయలేకపోయారు. ఇది చాలా సిగ్గుచేటు. కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ను గెలిపించండి. రాజాంను అభివృద్ధి చేసి చూపిస్తాం.’ అని గతేడాది ఫిబ్రవరి 14న రాత్రి రాజాంలో జరిగిన శంఖారావం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఈ సభ జరిగి శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఆయన హామీ ఇచ్చినట్లు కూటమి ప్రభుత్వంలో రాజాం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ ఏడు నెలల్లోనే వంద కోట్ల రూపాయలతో ఎన్నో పనులు చేడుతున్నారు.

ఆ రోజు లోకేశ్‌ ఏమన్నారంటే..

‘రాజాంలో పెత్తనం అంతా ఎమ్మెల్సీ విక్రాంత్‌, జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీనుదే. జోగులు పేరుకే ఎమ్మెల్యే. రాజాంలో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోలేని దుస్థితి. వారిద్దరి కనుసన్నల్లో రాజకీయం చేసిన ఘనత జోగులకు దక్కింది. ఏం చేయాలన్నా వారిద్దరి అనుమతి తప్పనిసరి కావడంతో రాజాం అభివృద్ధికి నోచుకోలేదు. మరొకరిపై ఆధారపడే ఎమ్మెల్యే ఉండడం ఈ ప్రాంతీయులు చేసుకున్న ఖర్మ. మేము అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. రాజాం-డోలపేట రహదారికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేస్తాం. మిగతా రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు ఇస్తాం. రాజాంలో పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేస్తాం’ అని శంఖారావం సభలో లోకేశ్‌ ప్రకటించారు.

రాజాం అభివృద్ధికి రూ.100 కోట్లు..

రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో మంత్రి హోదాలో నారా లోకేశ్‌ రాజాం నియోజకవర్గానికి సుమారు రూ.100 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులే కాకుండా రాజాం-డోలపేట రహదారి విస్తరణ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రూ.6.50 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించడంతో పాటు అదనంగా రూ.3.50 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుతం రహదారి పనులు జోరుగా సాగుతున్నాయి. గుంతల్లేని రహదారులే లక్ష్యంగా నియోజకవర్గానికి రూ.4 కోట్లు విడుదల చేయించారు. ఈ నిధులతో నాలుగు మండలాల్లోని రహదారుల మరమ్మతులు పూర్తయ్యాయి. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులతో పాటు నాలుగు నియోజకవర్గాల్లో కూడా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాజాంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:27 AM