Share News

Postponed Again మళ్లీ వాయిదా

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:38 PM

Postponed Again పాలకొండ చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడలేదు. కోరం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది.

Postponed Again మళ్లీ వాయిదా
ఎన్నిక ప్రక్రియ కోసం వేచి ఉన్న అధికారులు, కూటమి కౌన్సిలర్లు

నేడు మరోసారి కౌన్సిల్‌ సమావేశం

పాలకొండ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పాలకొండ చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడలేదు. కోరం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు టీడీపీ కౌన్సిలర్లు ముగ్గురు, వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన కౌన్సిలర్‌ కె.గంగునాయుడు, ఇటీవల టీడీపీలో చేరిన మరో కౌన్సిలర్‌ ఆకుల మల్లీశ్వరి, ఎక్స్‌అఫిషియోగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ కౌన్సిలర్లంతా గైర్హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు మల్లీశ్వరి ఎన్నికల అధికారి వద్దకు వెళ్లారు. అయితే కోరం లేకపోవడంతో నామినేషన్‌ కూడా తీసుకోలేమని ఈ సమావేశాన్ని ఈ నెల 18కు వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అబర్జర్వర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, పాలకొండ సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల అధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొత్తంగా నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది. నగరపంచాయతీలో సమావేశం ముగిసే వరకు వైసీపీ కౌన్సిలర్లంతా మాజీ ఎమ్మెల్యే కళావతితో కలిసి ఎమ్మెల్సీ విక్రాంత్‌ ఇంటిలోనే ఉన్నారు. కాగా మంగళవారం జరగనున్న చైర్‌పర్సన్‌ ఎన్నికపై టీడీపీ నుంచి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణలు కౌన్సిలర్లతో పాటు పార్టీ క్యాడర్‌తో చర్చించారు. మరోవైపు వైసీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ , మాజీ ఎమ్మెల్యే, శాసనసభ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సమావేశమయ్యారు.

భారీ బందోబస్తు...

పాలకొండ చైర్‌పర్సన్‌ ఎన్నిక నేపథ్యంలో డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ఎం.చంద్రమౌళి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కార్యాలయంలోకి సిబ్బంది, మీడియా, కౌన్సిలర్లను మాత్రమే అనుమతి ఇచ్చారు. కమిషనర్‌ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:38 PM