pm suryagar 30 వేల ఇళ్లకు పీఎం సూర్యఘర్
ABN , Publish Date - Jan 27 , 2025 | 11:55 PM
మొదటి విడతగా జిల్లాలో సుమారు 30 వేల ఇళ్లకు సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఫిబ్రవరి నుంచి యూనిట్ల ఏర్పాటు ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
30 వేల ఇళ్లకు పీఎం సూర్యఘర్
వెండర్లుగా మహిళా సంఘాలు
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మొదటి విడతగా జిల్లాలో సుమారు 30 వేల ఇళ్లకు సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఫిబ్రవరి నుంచి యూనిట్ల ఏర్పాటు ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో సోమవారం రాత్రి సమావేశం నిర్వహిచారు. జిల్లాలో 24,754 మంది ఎస్సీ లబ్ధిదారులు, 5489 మంది ఎస్టీ లబ్ధిదారులు, 6,897 మంది ఇతర లబ్ధిదారులు ఈ పథకం కింద పేర్లు రిజిస్టర్ చేసుకున్నారని కలెక్టర్ చెప్పారు. మున్సిపాల్టీలకు సంబంధించి విజయనగరం అర్బన్‌లో 2,176 మంది, బొబ్బిలిలో 479 మంది, రాజాంలో 579 మంది, నెల్లిమర్లలో సుమారు 150 మంది ఎస్సీ లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. రిజిస్ర్టేషన్ చేసుకున్న వారంతా ఏయే మహిళా సంఘాల పరిధిలోకి వస్తారో తెలియజేసే సర్వేను త్వరగా పూర్తి చేసి జాబితాలను నెలాఖరులోగా రూపొందించాలని ఆదేశించారు. వీరిలో స్వయం శక్తి సంఘాల సభ్యులకు స్ర్తీనిధి ద్వారా, ఇతర సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఔత్సాహిక స్వయం శక్తి సంఘాలను సైతం వెండర్లుగా గుర్తించి వారికి ఆదాయాన్ని సమకూర్చాలని సూచించారు. సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్.లక్ష్మణరావు, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ చిట్టిరాజు, ఎల్‌డీఎం వీవీఆర్ మూర్తి తదితరులు ఉన్నారు.