Share News

బతుకు బాట.. మెతుకు వేట

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:00 AM

వారివి వేర్వేరు ప్రాంతాలు. సొంతూరులో ఉపాధి కరువై పొట్టకూటి కోసం కుటుంబాలతో సహా ఇక్కడకు వలస వచ్చారు. ఈ ప్రాంతంలో వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొందరు వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తుంటే.. మరికొందరు టార్పాలిన్లు అమ్ముతుంటారు.. ఇంకొందరు చెరకు తోటలు నరికే కూలీలుగా పని చేస్తున్నారు. రోజంతా కష్టపడుతూ ఆ వచ్చిన డబ్బులతో బతుకు బండి లాగుతున్నారు.

 బతుకు బాట.. మెతుకు వేట
సంతకవిటి కూడలిలో బస చేసిన వలస కూలీలు

- వ్యవసాయ పనిముట్ల తయారీలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వాసులు

- వాటిని గ్రామాల్లో విక్రయిస్తూ జీవనం

- టార్పాలిన్లు అద్దెకిస్తున్న పల్నాడు వ్యక్తులు

-చెరకు పనిలో తుని, అన్నవరం కూలీలు

వారివి వేర్వేరు ప్రాంతాలు. సొంతూరులో ఉపాధి కరువై పొట్టకూటి కోసం కుటుంబాలతో సహా ఇక్కడకు వలస వచ్చారు. ఈ ప్రాంతంలో వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొందరు వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తుంటే.. మరికొందరు టార్పాలిన్లు అమ్ముతుంటారు.. ఇంకొందరు చెరకు తోటలు నరికే కూలీలుగా పని చేస్తున్నారు. రోజంతా కష్టపడుతూ ఆ వచ్చిన డబ్బులతో బతుకు బండి లాగుతున్నారు.

సంతకవిటి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి కొందరు తమ కుటుంబాలతో సహా సంతకవిటి మండలానికి వచ్చి జీవిస్తున్నారు. కష్టపడే వారికి భాష, ప్రాంతంతో సంబంధం లేదని, చెమట చిందిస్తేనే నాలుగు వేళ్లూ నోటిలోకి వెళ్తాయని నిరూపిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కత్తి, గొడ్డలి, గునపం, కత్తిపీటలు వంటి పనిముట్లు తయారు చేసి వాటిని విక్రయిస్తున్నారు. పనిముట్ల తయారీలో పురుషులతో పాటు మహిళలు కూడా చెమట చిందిస్తున్నారు. ఇనుమును కరిగించే సమయంలో మగవారితో సమానంగా సమ్మెట దెబ్బలు వేయడం, కొలిమిని మండించడం, తయారు చేసిన వస్తువులను విక్రయించడం వంటి పనులు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కోచోట రెండు, మూడు రోజులు ఉండి మరోచోటకు వలస వెళ్తున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఇలా వస్తున్న కుటుంబాలు మళ్లీ హోలీ పండగ సమయానికి తమ సొంతూళ్లకు వెళ్లిపోతాయి.


టార్పాలిన్లు అద్దెకు ఇస్తూ..

అపరాలు పంట చేతికి వచ్చే సమయం కావడంతో పల్నాడు జిల్లా నరసారావుపేట నుంచి కొందరు వ్యక్తులు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఊరూరా తిరుగుతూ టార్పాలిన్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. అపరాలు సీజన్‌ కావడంతో టార్పాలిన్లకు మంచి గిరాకీ ఏర్పడింది. పంటను కల్లాలకు తరలించకుండా రైతులు పొలాల్లోనే టార్పాలిన్లు వేసి నూర్పు చేస్తున్నారు. దీంతో రైతులకు శ్రమ తగ్గింది.

చెరకు నరికేందుకు..

నాగావళి నదీ తీర గ్రామాల్లో చెరకు పంటను అధికంగా పండిస్తుంటారు. ఈ చెరకు తోటలను నరికి రేగిడి మండలం సంకిలిలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించేందుకు తుని, అన్నవరం తదితర ప్రాంతాల నుంచి కూలీలు ఇక్కడకు చేరుకున్నారు. ప్రతిరోజూ చెరకు కొట్టి ట్రాక్టర్లకు ఎక్కిస్తుంటారు. వీరికి టన్నులను బట్టి ఫ్యాక్టరీ వారు డబ్బులు చెల్లిస్తుంటారు. గ్రామాల్లో రైతులు వీరికి షెల్టర్‌ ఇవ్వడంతో పాటు వంట చేసుకునేందుకు పాత్రలు, పాలు తదితర వస్తువులు సమకూరుస్తారు.

ప్రతి ఏటా వస్తాం

జీవనోపాధి కోసం ప్రతి ఏటా ఈ ప్రాంతానికి వలస వస్తుంటాం. ఒక్కో గ్రామంలో తిరుగుతూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తుంటాం. ఆ వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నాం. రైతులు మా పనిముట్లను ఆదరిస్తున్నారు.

-సామ్‌లాల్‌, భూపాల్‌, మధ్యప్రదేశ్‌

టార్పాలిన్లకు గిరాకీ

ఈ ప్రాంతంలో టార్పాలిన్లకు మంచి గిరాకీ ఉంది. దీంతో ప్రతి ఏటా ఇక్కడకు వాటిని తీసుకువస్తాం. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే ఉండి వాటిని అద్దెకు ఇచ్చి జీవనోపాధి సాగిస్తున్నాం.

-యు.నాగేశ్వరరావు, నరసారావుపేట, పల్నాడు జిల్లా

Updated Date - Mar 05 , 2025 | 12:00 AM