Four Mandals నాలుగు మండలాలకు ఒకటే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:14 AM
One for Four Mandals వేసవి కాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో గరిష్ఠస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. అప్రమత్తంగా లేకుంటే భారీగా నష్టపోక తప్పదు.

రైల్వే గేట్లు దాటి ప్రమాద స్థలానికి చేరేలోపు భారీ నష్టం
ఇప్పటికే అగ్నికి ఆహుతవుతున్న తోటలు
ఆందోళనలో అన్నదాతలు
కొమరాడ, మార్చి8(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో గరిష్ఠస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. అప్రమత్తంగా లేకుంటే భారీగా నష్టపోక తప్పదు. అయితే కొమరాడలో అగ్నిమాపక కేంద్రం లేదు. దీంతో సకాలంలో ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు రావడం లేదు. పార్వతీపురం జిల్లా కేంద్రం నుంచి మూడు రైల్వే క్రాసింగ్ గేట్లు దాటి కొమరాడ మండలంలోకి ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పూర్తిస్థాయిలో నష్టపోతున్నట్లు బాధితులు వాపోతున్నారు. వాస్తవంగా సీతానగరం, పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి మండలాలకు ఒకటే ఫైరింజన్ ఉంది. పార్వతీపురంలో ఉన్న అగ్నిమాపక శకటం ఆయా ప్రాంతాలకు వెళ్లే సరికి బాధితులకు భారీగా నష్టం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించాలని ఆయా మండలాలవాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
సూర్య ప్రతాపానికి పచ్చిక బైర్లు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పచ్చని పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. సకాలంలో ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకోలేకపోవడంతో మంటలు వేగంగా వ్యాపించి జీడి మామిడి, పామాయిల్ వంటి చెట్లు కాలి బూడిదవుతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగి పంటలు, డ్రిప్ పరికరాలు బూడిదైన సందర్భాలున్నాయి. కొమరాడ మండలం కొత్తవలస గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు ఆరు ఎకరాల్లో జీడి మామిడి చెట్లు కాలి బూడిదయ్యాయి. దీంతో గిరిజన రైతులకు సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. తోటల పరిసర ప్రాంతాల్లో గడ్డి ఎండిపోయి ఉండడంతో బాటసారులు, ఆకతాయిలు నిప్పు పెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బలిజిపేట మండలం మిర్తివలసలోనూ 1,839 టేకు, జీడిమామిడి చెట్లు దగ్ధమయ్యాయి.
మానవ తప్పిదంతోనే...
మానవ తప్పిదంతోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదం వల్ల పండ్ల తోటలు కాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇందుకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు. రైతులు వారి పొలాల చుట్టూ ట్రెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. చెట్లు మధ్య ఎండు గడ్డి, ఆకులు లేకుండా చూసుకుంటే నష్టం తీవ్రతను తగ్గించుకోవచ్చు.
- క్రాంతికుమార్, ఉద్యాన శాఖ అధికారి, పార్వతీపురం