ఇళ్ల మీదకు సంద్రం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:24 PM
occean attack కెరటాలు ఉవ్వెత్తున తీరాన్ని తాకుతున్నాయి. పెద్దశబ్ధం చేస్తూ తీరాన్ని కోసేస్తున్నాయి. తుఫాన్ల సమయంలో ఒడ్డున ఉన్న ఇళ్లపైకి వస్తున్నాయి. కొద్ది సంవత్సరాలుగా సంద్రం వస్తున్న మార్పులు చూస్తున్న మత్స్యకారులు నిరంతరం టెన్సన్‌తో ఉంటున్నారు.

ఇళ్ల మీదకు సంద్రం
భారీ కోతకు గురవుతున్న తీరం
ఆందోళనలో మత్స్యకారులు
సునామి లాంటి ఉపద్రవాలొస్తే కష్టమే
రక్షణ గోడ నిర్మించాలని సంవత్సరాలుగా విన్నపం
కెరటాలు ఉవ్వెత్తున తీరాన్ని తాకుతున్నాయి. పెద్దశబ్ధం చేస్తూ తీరాన్ని కోసేస్తున్నాయి. తుఫాన్ల సమయంలో ఒడ్డున ఉన్న ఇళ్లపైకి వస్తున్నాయి. కొద్ది సంవత్సరాలుగా సంద్రం వస్తున్న మార్పులు చూస్తున్న మత్స్యకారులు నిరంతరం టెన్సన్‌తో ఉంటున్నారు. ప్రధానంగా హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన విలయం వారి మనసు నుంచి ఇప్పటికీ చెరిగిపోలేదు. అయితే కాస్త అయినా భద్రంగా బతకాలంటే తీరం పొడవునా రక్షణ గోడ నిర్మించాలని రెండు మండలాల మత్స్యకారులు ఎన్నెన్నో విన్నపాలు ఇస్తున్నారు. కనిపించిన అధికారులందరినీ వేడుకుంటున్నారు. ఎవరూ కనికరించడం లేదని వాపోతున్నారు.
భోగాపురం, జనవరి17(ఆంధ్రజ్యోతి):
సముద్ర తీర ప్రాంతం కొంత కాలంగా భారీ కోతకు గురవుతోంది. జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో సుమారు 28 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరం కోతకు గురవుతుండడం మత్స్యకారులకు ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ముక్కాం తీరాన్ని అలలు ఛిద్రం చేశాయి. ఆ సమయంలో సీసీ రహదారితో పాటు గృహాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అప్పటి నుంచి మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా తుఫాన్ల సమయంలో భోగాపురం మండలం ముక్కాం గ్రామం కోతకు గురవుతుంటుంది. ఆ సమయంలో గ్రామస్థులు పడే బాధలు వర్ణనాతీతం. రుతుపవనాల సమయంలో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, సముద్ర జలాలు కలుషితం కావడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల కలయికతో భారీ అలలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అవి తీరం దాటే సమయంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చుతుండడంతో తీరం కోతకు గురవుతోంది. 28 కిలోమీటర్ల పరిధిలో భోగాపురం, పూసపాటిరేగ మండలాలు ఉండగా 16 మత్స్యకార గ్రామాలు సముద్రం అంచున ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యం భయాందోళనతో ఉంటున్నారు. ఈదురుగాలులకు తీర ప్రాంతంలో రైతులు పెంచుకున్న కొబ్బరి, జీడి, మామిడి నేలకొరుగుతుంటాయి. హుద్ హుద్ సమయంలో రెండు మండలాల్లోని తీర ప్రాంతాల్లో వేలాది కొబ్బరి, మామిడి, జీడి చెట్లు నేలకూలాయి. మళ్లీ అలాంటి తుఫాన్ వస్తే ప్రాణాపాయం పొంచి ఉందని, కనీసం తీరం పొడవునా రక్షణ గోడ నిర్మిస్తే కాస్త భరోసాగా బతుకుతామని మత్స్యకారులు వేడుకుంటు న్నారు.
ఆందోళనగా ఉంటోంది
తీరం కోతకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదికేడాది తీరం తగ్గిపోతోంది. భారీ తుఫాన్ల సమయంలో మత్స్యకార గ్రామాల్లోకి సైతం నీరు చొచ్చుకొస్తోంది. ఆ సమయంలో మా బాధలు వర్ణనాతీతం. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను ఏవిధంగాను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా పటిష్ట చర్యలు చేపట్టాలి.
- గరికిన చినరాము, మత్స్యకారుడు, ముక్కాం
రక్షణగోడ నిర్మాంచాలి
తీర ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకుంటే తీర ప్రాంత మనుగడ కష్టం. ముక్కాం తీరం కోతకు గురికావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. తీరం కోతకు గురైతే భవిష్యత్‌లో అనేక అనర్థాలు, గండాలు తప్పవు. దీనిపై ప్రజా ప్రతినిధులు శ్రద్ధచూపి తీరం కోతకు గురి కాకుండా కనీసం రక్షణ గోడ నిర్మించాలి.
- బడే నాయుడు, మత్స్యకారుడు, భోగాపురం.