ఇక కాగితరహిత పాలన
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:17 PM
పంచాయతీల బలోపేతంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ వాటికి జీవంపోస్తుంది. గత వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.
- స్వర్ణ పంచాయతీ పథకం ప్రారంభం
- జిల్లాలో అమలుకు శ్రీకారం
- తగ్గనున్న ఆర్థిక భారం
- పన్నుల వసూళ్లలో అక్రమాలకు చెక్
రాజాం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): పంచాయతీల బలోపేతంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ వాటికి జీవంపోస్తుంది. గత వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కేవలం సంక్షేమ పథకాలు అని ఐదేళ్ల కాలం గడిపేశారు. గ్రామాల్లో చిన్నపాటి పనులు కూడా చేయలేదు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు అంటూ హడావుడి తప్ప వాటిని పూర్తిచేసిన దాఖలాలు లేవు. అటు న్యాయబద్ధంగా పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు అందించలేకపోయింది జగన్ సర్కారు. అందుకే వాటిని సరిచేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పల్లెపండుగ పేరుతో జిల్లాలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం జరుగుతోంది. ఇంకోవైపు ఉపాధి హామీ పనులు సైతం ఊపందుకోనున్నాయి. ఇప్పుడు తాజాగా స్వర్ణ పంచాయతీ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. పంచాయతీల్లో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టింది. అంతా డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక అంతా డిజిటల్..
జిల్లాలో 776 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో డిజిటల్ సేవలు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిరకాల లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాలు డిజిటల్ ద్వారానే చేయాలని భావిస్తోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ‘స్వర్ణ పంచాయతీ’ లాగిన్‌లో నమోదుచేశారు. సాధారణంగా స్థానిక సంస్థల్లో పంచాయతీలు కీలకం. ప్రజల మౌలిక వసతులు తీర్చడం వాటి ప్రధాన కర్తవ్యం. అలాగే వివిధ రకాల పన్నుల వసూలు చేసి.. తిరిగి వాటిని ప్రజల కోసమే ఖర్చు చేయడం కూడా వాటి విధి. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇంటి, ఆస్తి పన్నులకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి పన్నులు సేకరించి సిబ్బంది సొంత అవసరాలకు మళ్లించినట్టు సైతం ఆరోపణలు వినిపించాయి. అందుకే పన్నుల వసూలుకు సైతం పారదర్శకత తేవాలని స్వర్ణ పంచాయతీ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఇక నుంచి దీని ద్వారా డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేయనున్నారు. ఇప్పటికే ఇంటి పన్నుల రూపంలో రూ.14.16 కోట్లు, నాన్ ట్యాక్స్ రూపంలో రూ.4 కోట్ల వసూలుకు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మార్చి 31లోగా వసూలు చేయాలని నిర్ణయించింది.
తగ్గనున్న ఆర్థిక భారం..
దాదాపు ప్రభుత్వ శాఖలన్నీ కాగితపు సేవలకు స్వస్తిపలికాయి. ఇక అంతా డిజిటల్ సేవలే. కాగితపు సేవలతో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నిర్వహణ కూడా చాలా కష్టం. రికార్డుల భద్రత కూడా కత్తిమీద సాములా మారుతోంది. కాగితపు సేవలతోనే అనేక రకాల అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. పైగా పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో స్టేషనరీ, ఇతరత్రా ఖర్చులకు చాలా ఇబ్బందికరం. అందుకే డిజిటల్ సేవల వైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. పాలనలో పారదర్శకత, భవిష్యత్‌లో సులువుగా గణాంకాలు తెలుసుకోవడం వంటి వాటికోసమే డిజిటల్ సేవలను తెచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలోని 776 పంచాయతీలకుగాను.. దాదాపు డిజిటలైజేషన్ పూర్తయినట్టు తెలుస్తోంది.
పారదర్శకత కోసమే..
పంచాయతీల్లో డిజిటలైజేషన్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ పంచాయతీ పథకాన్ని అమలుచేస్తున్నాం. ప్రతి ఇంటి వివరాలను నమోదుచేశాం. పన్నుల వసూలు కూడా ఈ లాగిన్ ద్వారానే చేస్తాం. పారదర్శకత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- వెంకటేశ్వరరావు, డీపీవో, విజయనగరం
మంచి నిర్ణయం
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌తో పంచాయతీలకు కొంత ఖర్చు తగ్గుతుంది. గత ఐదేళ్లుగా పంచాయతీలను దారుణంగా దెబ్బతీసింది కూటమి ప్రభుత్వం. ఇపడిపడే పంచాయతీలు కుదరుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో డిజిటలైజేషన్ ఆహ్వానించదగ్గదే.
- వంగా వెంకటరావు - సర్పంచ్, ఒమ్మి
మంచి రోజులు వచ్చాయి..
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే పంచాయతీలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెపండుగతో పాటు ఆర్థిక సంఘం నిధులతో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా వైసీపీ సర్కారు పంచాయతీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. కూటమి వచ్చిన తరువాతే స్వాంతన కలిగిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది.
- సర్పంచ్, రాజాం మండలం