Neglect of medicine వైద్యంపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:15 AM
Neglect of medicine ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా.. డాక్టర్ ప్రవర్తన ఎలా ఉంది.. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది.. డాక్టరు రాసిన మందులు ఆస్పత్రిలో ఇస్తున్నారా.. పరిశుభ్రత ఎలా ఉంది.. జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంలో ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ఆరోగ్య శాఖపై ప్రజాభిప్రాయ సేకరణలో అడిగిన ప్రశ్నలివి.

వైద్యంపై నిర్లక్ష్యం
ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండని డాక్టర్లు
స్కెతస్కోపుతో చూడకుండానే ప్రిస్ర్కిప్సన్
బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్న సిబ్బంది
ఒకమాత్ర ఇస్తే మరో రెండు బయట కొనుక్కోవాలని సలహా
ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా.. డాక్టర్ ప్రవర్తన ఎలా ఉంది.. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది.. డాక్టరు రాసిన మందులు ఆస్పత్రిలో ఇస్తున్నారా.. పరిశుభ్రత ఎలా ఉంది.. జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంలో ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ఆరోగ్య శాఖపై ప్రజాభిప్రాయ సేకరణలో అడిగిన ప్రశ్నలివి. కనీసం ఒక్కదానికి కూడా 80 శాతం సంతృప్తి రాలేనట్లు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు ఈ సర్వేకు అద్దం పడుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును వేలెత్తి చూపుతున్నాయి.
- మెంటాడ మండలం కూనేరు పంచాయతీ శివారు మిర్తివలస గ్రామానికి చెందిన మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండడంతో గత 4న గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది గర్భిణి పరిస్థితిని సరిగా చూడకుండానే ఘోసాసుపత్రికి రిఫర్ చేసేశారు. చివరికి ఆమె 108 వాహనంలో ప్రసవించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
- శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ శివారు రాయపాలెం, కురిడి, బొడ్డవర పంచాయతీ శివారు శనగపాడు, గునపాడు తదితర గిరిజన గ్రామాలకు చెందిన చిన్నారులు జ్వరాల బారిన పడితే తల్లిదండ్రులు వీరిని ఎత్తుకొని సుమారు పది కిలోమీటర్ల దూరం నడిచాక వాహనంలో ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నేటకీ జ్వారాలతో బాధపడుతున్న చిన్నారులు గిరిజన పల్లెల్లో ఉన్నారు. ఈవిషయం పత్రికల్లో వచ్చిన తరువాతే వైద్య ఆరోగ్య శాఖ కదిలింది.
- ఎస్.కోట, గంట్యాడ, వేపాడ, పెదమజ్జిపాలెం, అండ్ర, చల్లపేట, బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గిరిజన గ్రామాల ప్రజలు ఎక్కువగా మలేరియా జ్వరాల బారిన పడుతుంటారు. ఇందుకు సంబంధించిన మాత్రలు ఆసుపత్రులో ఉండడం లేదు.
- చేతి మణికట్టు నొప్పిగా ఉందని శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి ఇటీవల ఓ మహిళ వెళ్లగా నొప్పి నివారణ ఇంజెక్షన్ ఆసుపత్రిలో లేదని చెప్పారు. దీంతో ఆమె స్థానిక ప్రైవేటు మెడికల్ షాపులో రూ.3వేలు చెల్లించి ఇంజెక్షన్ కొనుగోలు చేసింది.
శృంగవరపుకోట, మార్చి8(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ఆసుపత్రులకెళ్లిన రోగులను కదిలిస్తే ఇక్కడ అందుతున్న సేవలొక్కటేకాదు సిబ్బంది దురుసుతనం గురించి ఏకరువు పెడుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కేంద్రాసుపత్రుల వరకు ఒకటే తీరు. అనారోగ్యంతో అక్కడకు వచ్చేవారి చేతిని వైద్యులు పట్టుకోరు. మెడలో వేసుకున్న స్కెతస్కోపును తీయరు. తీసినా మొక్కుబడే. రోగులు చెబు తున్న బాధలకు అనుగుణంగా సీటిని(ప్రిస్ర్కిప్సన్) రాసిచ్చేస్తారు. బీపీ, బరువు, ఎత్తు వంటి వాటిని ఆశ కార్యకర్తలు, శిక్షణ పొందుతున్న నర్సులే చూస్తున్నారు. వారు రాసిచ్చిన వివరాలనే వైద్యులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వైద్యులు రాసిచ్చిన సీటిని ఆసుపత్రుల్లోని మెడికల్ షాపు (ఫార్మాసిస్ట్)లో చూపిస్తే ఒక మాత్ర ఇస్తున్నారు. రెండు మాత్రలు లేవంటున్నారు. కాగా సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలున్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా చేసిన శస్త్ర చికిత్సలకు వైద్యులకు, సిబ్బందికు ప్రభుత్వం కమీషన్ ఇస్తుంది. అయినా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయడం లేదు. ఆరోగ్య శ్రీలో దీనికి సంబంధించిన వైద్యం లేదని చెప్పేస్తున్నారు. అక్కడున్న ఆరోగ్య మిత్రలతోనూ ఇదే విషయాన్ని చెప్పిస్తున్నారు. ఈ వైద్యులే సొంత క్లినిక్‌లలో శస్త్రచికిత్సకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వైద్యులిలా ఉండగా సిబ్బంది దురుసు ప్రవర్తనతో ప్రభుత్వ ఆసుపత్రులంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ప్రసవం కోసం ఆసుపత్రులకు వచ్చిన గర్భిణుల పట్ల రాయడానికి వీలుకాని భాషను వాడుతున్నారు. పురిటినొప్పుల కంటే వారి మాటలే ఎక్కువ బాధిస్తున్నాయని స్వయంగా గర్భిణులే ‘ఆంధ్రజ్యోతి’ వద్ద వాపోయారు. ఆసుపత్రుల్లో పరిస్థితులపై ప్రభుత్వం దృష్టిసారించిన తరువాతే సంతృప్తి స్థాయిని ఆశించాలని సీనియర్ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు.