Share News

need not walking ‘నడక’యాతన ఉండదిక!

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:51 PM

need not walking in feture శృంగవరపుకోట పంచాయతీ శివారు రేగ పుణ్యగిరికి చెందిన గర్భిణి సీదిరి శాంతికి ఈ నెల 9న అర్ధరాత్రి సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డోలీ కట్టి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి బయలు దేరారు.

need not walking ‘నడక’యాతన ఉండదిక!
మార్గమధ్యలో డోలీలో ప్రసవించిన ఎస్‌.కోట రేగ పుణ్యగిరికు చెందిన సిదిరి శాంతి(ఫైల్‌)

‘నడక’యాతన ఉండదిక!

గిరిజనుల డోలీ కష్టాల నుంచి త్వరలోనే ఉపశమనం

ఎస్‌.కోట రేగ పుణ్యగిరి రోడ్డు నిర్మాణానికి శంకస్థాపన

పుణ్యగిరి క్షేత్రం భక్తులకూ ఉపయోగమే

వేపాడ మండలం మారిక గిరిజన గ్రామానికీ రోడ్డు

శృంగవరపుకోట, జనవరి 30(ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట పంచాయతీ శివారు రేగ పుణ్యగిరికి చెందిన గర్భిణి సీదిరి శాంతికి ఈ నెల 9న అర్ధరాత్రి సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డోలీ కట్టి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి బయలు దేరారు. అయితే మార్గమధ్యలో ఆమె ప్రసవించింది. మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ గ్రామ గిరిజనులకు ఏ కష్టమొచ్చినా డోలీ కట్టాల్సిందే. ఇకనుంచి ఈ పరిస్థితి తప్పనుంది. గ్రామానికి రహదారి సదుపాయం కల్పించేందుకు కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఉపాధి హామీ నిధుల నుంచి రూ.4 కోట్లను కేటాయించారు. కొద్దిరోజుల కిందటే రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. దీంతో ఈ గ్రామ గిరిజన ప్రజానీకంతో పాటు పుణ్యగిరి భక్తులకు మెట్లు ఎక్కాల్సిన పని తప్పనుంది.

ఎస్‌.కోట మండలంలో గిరిజన గ్రామాలు అధికం. దీనికి తోడు ఎక్కువగా కొండపైనే ఉన్నాయి. రహదారుల సదుపాయం లేక గర్భిణులు, బాలింతలు, అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి డోలీ కట్టాల్సిందే. ఈ పరిస్థితిలో మార్గమధ్యలో ప్రసవాలు జరగడం, సమయానికి వైద్యం అందక మరణాలు సంభవించడం జరుగుతోంది. ఈ పరిస్థితిని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మూల బొడ్డవర పంచాయతీ శివారు చిట్టింపాడు గ్రామంలో ఈ విధంగా మరణాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో ప్రతి పక్షంలో వున్న ప్రస్తుత విశాఖ ఎంపీ శ్రీభరత్‌, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పరిస్థితిని అంచనా వేసేందుకు కొండెక్కారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ సమయంలో గిరిజన గ్రామాలకు రోడ్లేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోపే ఈ గ్రామానికి రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11 కోట్ల నిధులు రాబట్టారు. మరోవైపు రేగ పుణ్యగిరి, వేపాడ మండలం మారిక రోడ్డు కోసం ఈనెల 13న ఎమ్మెల్యే లలితకుమారి కలెక్టర్‌ను కలిసి రోడ్లు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీంతో కలెక్టర్‌ స్పందించి ఈనెల 17న ఎమ్మెల్యేతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి గిరిజనులతో మాట్లాడారు. వారం రోజులు తిరగక ముందే నిధులు కేటాయించారు. మారిక గ్రామ రోడ్డు నిర్మాణానికి కూడా ఉపాధి హామీ నిధుల నుంచి రూ.7కోట్లు మంజూరు చేశారు. 5.6 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు నిర్మించనున్నారు.

పుణ్యగిరికి పెరగనున్న భక్తులు

పుణ్యగిరి క్షేత్రం పైన రేగ పుణ్యగిరి గ్రామం ఉంది. శృంగవరపుకోట దేవిబొమ్మ కూడలి నుంచి వున్న రోడ్డు పుణ్యగిరి ఆలయ సింహద్వారం వరకు వుంది. ఈ ఆలయంలో కోలువై వున్న ఉమా కోటి లింగేశ్వరస్వామిని దర్శించుకోవాలన్నా.. ఇక్కడున్న పుట్టధార స్నానఘట్టం వద్ద స్నానం చేయాలన్నా మెట్లమార్గంలో నడిచి వెళ్లాలి. మెట్లుక్కి వెళ్లేందుకు కష్టంగా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి రోడ్డు వేయాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం పట్టించుకుంది. రేగ పుణ్యగిరి వరకు వేయనున్న రోడ్డు పుణ్యగిరి ఆలయం పక్క నుంచి వెళుతుంది. మెట్లు ఎక్కేందుకు ఇష్టపడని భక్తులు వాహనాలపై ఆలయం సమీపం వరకు వెళ్లవచ్చు. దీంతో కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లోనే కాకుండా నిత్యం ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చునని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మారికకు రోడ్డు మార్గం

వేపాడ మండలం కరకవలస పంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామం కూడా కొండపై ఉంది. 10.6 కిలోమీటర్లున్న ఈ రోడ్డు నిర్మాణానికి 2013-14లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.5కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో కొంతవరకు రోడ్డు నిర్మించి ఆపేసారు. గిరిజనులు మొరపెట్టుకున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మించేందుకు అవసరమైన నిధులను అందిస్తోంది.

Updated Date - Jan 30 , 2025 | 11:51 PM