TDP's Account? పురపాలక సంఘం.. టీడీపీ ఖాతాలోకి?
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:53 PM
Municipal Corporation.. Into TDP's Account? పార్వతీపురం పురపాలక సంఘం రాజకీయ ముఖచిత్రం మారుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ లోకి వైసీపీ కౌన్సిలర్లు లైన్ కడుతుండడంతో పార్వతీ‘పురం’ తెలుగుదేశం పార్టీ పరమమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. త్వరలో పురపాలక సంఘంపై టీడీపీ జెండా ఎగరనుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
అధికారపార్టీలోకి క్యూ కడుతున్న వైసీపీ కౌన్సిలర్లు
పార్వతీపురం, ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘం రాజకీయ ముఖచిత్రం మారుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ లోకి వైసీపీ కౌన్సిలర్లు లైన్ కడుతుండడంతో పార్వతీ‘పురం’ తెలుగుదేశం పార్టీ పరమమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. త్వరలో పురపాలక సంఘంపై టీడీపీ జెండా ఎగరనుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాస్తవంగా పార్వతీపురంలో 30 మంది వార్డులకు గాను వైసీపీ 22 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ ఐదు, ఇండిపెండెంట్లు రెండు, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. అయితే ఎన్నికలకు ముందు 26వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కరుణ, ఆమె భర్త మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయ ప్రకాష్ నారాయణ (జయబాబు) , ఆరో వార్డుకు చెందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ పారినాయుడు టీడీపీ చేరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా నలుగురు వైసీపీ కౌన్సిలర్లు, తాజాగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో మరో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తంగా కూటమి సభ్యుల సంఖ్య 15కు చేరింది. పైగా ఎమ్మెల్యేకు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు ఉంటుంది. దీంతో వైసీపీ ఆధిక్యం కోల్పోయిన నేపథ్యంలో పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్వతీపురం పురపాలక సంఘం లో వైసీపీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అవసరం. అయితే చైర్‌పర్సన్ ఎన్నికల్లో 16 మంది కౌన్సిలర్లు ఎటువైపు ఉంటే ఆ పార్టీకి విజయం లభిస్తుంది. ప్రస్తుతం టీడీపీకి మెజార్టీ ఉండడంతో చైర్‌పర్సన్ పీఠం దక్కించుకుంటుందనే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అవిశ్వాసంలో గెలిస్తే పీఠం ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా బీసీ మహిళకు చైర్‌పర్సన్ కుర్చీ రిజర్వు కావడంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందో వారికే చైర్‌పర్సన్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.