Snail’s Pace! నత్తనడకన!
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:45 PM
Moving at a Snail’s Pace! సీతంపేట మన్యంలో ఆదివాసీల గృహ నిర్మాణాలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వివిధ కారణాలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

లబ్ధిదారుల్లో అనేక సందేహాలు
పనుల్లో కానరాని ప్రగతి
సీతంపేట రూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో ఆదివాసీల గృహ నిర్మాణాలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వివిధ కారణాలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పీఎం జన్‌మన్ పథకం కింద గిరిశిఖర గ్రామాల్లో (పీవీటీజీ)గిరిజనులకు గృహాలు మంజూరయ్యాయి. అయితే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో గత ఆరు నెలలుగా ఆయా పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిలో కదలిక వచ్చింది. ఉన్నట్టుండి గడిచిన రెండు నెలలుగా గిరిజన లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఆదివాసీ లబ్ధిదారులు మళ్లీ గృహ నిర్మాణాల్లో నిమగ్నమయ్యారు.
గిరిజనుల్లో సందేహాలు
పీవీటీజీ ఆదివాసీలకు మంజూరైన గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు హౌసింగ్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి మరీ లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టారు. వీటికి సంబంధించిన బిల్లులు ఇప్పటీకి చెల్లింపులు కాకపోవడంతో గిరిజనుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా రెవెన్యు శాఖ నుంచి ల్యాండ్ పొజీషన్ సర్టిఫికెట్లు కూడా సకాలంలో రావడం లేదు. దీంతో గృహ నిర్మాణాలకు గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు. వారిలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంలో హౌసింగ్, సచివాలయ సిబ్బంది విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సీతంపేట మన్యంలో ఆశించిన స్థాయిలో గృహ నిర్మాణాలు జరగడం లేదు.
ఇదీ పరిస్థితి..
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర సర్కారు పీఎం జన్‌మన్, పీఎం జూగ వంటి పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా సీతంపేట మన్యంలో 2023-24లో లబ్ధిదారుల ఎంపికపై సంబంధిత హౌసింగ్, సచివాలయ సిబ్బంది అప్పట్లో సర్వే చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పురిపాక, రేకులషెడ్డులో ఉంటున్న 2,023 మంది పీవీటీజీ లబ్ధిదారులను గుర్తించారు. వీరికి శాశ్వత గృహ నిర్మాణాల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం గృహాలను మంజూరు చేసింది.
గృహాలు మంజూరు ఇలా...
పీఎం జన్‌మన్ పథకం కింద మండలంలో 36 సచివాలయాల పరిధిలో 2,023 గృహాలు మంజూరయ్యాయి. దేవనాపురం 39, దారపాడు 86, గొయిది 76, హడ్డుబంగి 80, కడగండి 141, కిండంగి 101, కోడిశ 73, కొండాడ 92, కోతాం 153, కుడ్డపల్లి 131, మండ 91, మర్రిపాడు 109, పెదరామ 63, పొల్ల 60, సోమగండి 152, పూతికవలస 109, తాలాడ 83, టిటుకుపాయి 50, వజ్జాయిగూడ 53, కుసిమి 48, కీసరజోడు 30, పెద్దూరు 30, పుబ్బాడ 23, సామరెల్లి 30, శంభాం 24 తదితర పంచాయతీలకు గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో గృహ నిర్మాణానికి లబ్ధిదారుడికి రూ.2.39లక్షలు చెల్లించనున్నారు. ఇంటి నిర్మాణ సమయంలో విడతల వారీగా బిల్లుల రూపంలో లబ్ధిదారులకు ఆ మొత్తం చెల్లిస్తారు.
బిల్లుల చెల్లింపులు ఇలా..
మండలంలో 2023 గృహాలకు గాను 1400 ఇళ్లకు రూ.70 వేల చొప్పున బిల్లు మంజూరు కోసం గతేడాదిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే 58 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు మాత్రమే బిల్లులు జమయ్యాయి. దీంతో మిగతావారు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పీవీటీజీ గ్రామాల్లో ఆదివాసీలు గృహ నిర్మాణం ప్రారంభించి పునాది లెవెల్‌కు చేరే సరికి మొదటి విడతగా బ్యాంకు ఖాతాలో రూ.70వేలు వేస్తారు. రూఫ్ లెవెల్‌లో రూ.90.వేలు, శ్లాబుకు రూ.40వేలు, ఉపాధి మస్తర్ కింద రూ.27వేలు, బాత్‌రూమ్ నిర్మాణ దశలో రూ.12వేల చొప్పున లబ్ధిదారులకు అందజేస్తారు. మొత్తంగా గృహ నిర్మాణానికి రూ.2.39లక్షల లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు నేరుగా జమచేస్తారు.
వివిధ దశల్లో ..
సీతంపేట మండలంలో పీఎం జన్‌మన్ పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 2,023 గృహాలు మంజూరు కాగా వాటిలో 302 ఇళ్లు పునాది దశలో , 80 రూఫ్ లెవెల్‌లో ఉన్నాయి. 20 గృహాల శ్లాబులు పూర్తికాగా మరో 6 ఇళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అయితే వీటికి సంబంధించిన బిల్లులు కూడా సకాలంలోనే లబ్ధిదారులకు చెల్లింంచినట్లు మండల హౌసింగ్ ఏఈ వెంకటేష్ తెలిపారు.
అందుకే జాప్యం..
ల్యాండ్ పొజీషన్ సర్టిఫికెట్ల మంజూరు జాప్యం కారణంగానే గిరిజనుల గృహ నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి. కాగా ఇంత వరకు నిర్మాణాలు చేపడుతున్న పీవీటీజీ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. దీనిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం.
- కె.గీతాంజలి, ఎంపీడీవో, సీతంపేట