పోలింగ్ నిర్వహణపై సమావేశం
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:06 AM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై స్థానిక ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

బొబ్బిలి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఈనెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై స్థానిక ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహణ విధి విధానాలను కూలంకుషంగా వివరించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆయా మండల కేంద్రాలలో గల హైస్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రాలకు 40 మంది పోలింగ్ కోసం, 60 మంది మెటీరియల్ పంపిణీ కోసం ఎన్నికల సిబ్బందిని నియమించామన్నారు. వారంతా బుధవారం ఆర్డీవో కార్యాలయానికి వచ్చి తమ మెటీరియల్‌ను తీసుకెళతారని ఆర్డీవో వివరించారు. ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ నిర్వహించరాదని, ఏవైనా సందేహాలు, సమస్యలుంటే వాటిని ఉన్నతాధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆర్డీవో తెలిపారు.
బొబ్బిలి డివిజన్‌లో 1064 ఓటర్లు
బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, దత్తిరాజేరు, మెంటాడ, గజపతినగరం మండలాల పరిధిలో మొత్తం 1064 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వారిలో 759 మంది పురుషులు, 305 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు రవికుమార్, శంబంగి రామకృష్ణ, రాంబాబు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ బలివాడ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.