Share News

వైద్య విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:27 AM

Medical student suicide నెల్లిమర్లలోని మిమ్స్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థి ఆత్కూరి సాయిమణిదీప్‌ (24) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఉంటున్న హాస్టల్‌ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ సూసైడ్‌ నోట్‌ రాసి అందులో డాడీ, అమ్మా, తమ్ముడూ నన్ను క్షమించండి అంటూ కోరాడు.

వైద్య విద్యార్థి ఆత్మహత్య
ఎ.సాయిమణిదీప్‌(ఫైల్‌)

వైద్య విద్యార్థి ఆత్మహత్య

డాడీ, అమ్మా, తమ్ముడూ నన్ను క్షమించండి అంటూ సూసైడ్‌ నోట్‌

మిమ్స్‌ వైద్య కళాశాలలో విషాదం

స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు

నెల్లిమర్ల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్లలోని మిమ్స్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థి ఆత్కూరి సాయిమణిదీప్‌ (24) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఉంటున్న హాస్టల్‌ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ సూసైడ్‌ నోట్‌ రాసి అందులో డాడీ, అమ్మా, తమ్ముడూ నన్ను క్షమించండి అంటూ కోరాడు. మణిదీప్‌ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు. తనయుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు సాయంత్రానికి నెల్లిమర్ల చేరుకున్నారు. వారిని ఓదార్చడం ఎవరితీరం కాలేదు. నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సాయిమణిదీప్‌ నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్‌ గదిలో మణిదీప్‌తో ఉంటున్న తోటి విద్యార్థులు పండుగకు స్వగ్రామాలకు వెళ్లారు. ఇంకా రాలేదు. శనివారం రాత్రి 7 గంటల వరకు పక్క రూమ్‌ విద్యార్థులతో మాట్లాడి తలుపులు వేసుకున్న మణిదీప్‌ ఆదివారం ఉదయం 10 గంటల వరకు బయటకు రాలేదు. పక్క రూమ్‌ విద్యార్థులకు సందేహం కలిగి కిటికీలో నుంచి చూశారు. మంచంపై లేకపోవడంతో గదిలోకి వెళ్లి పరిశీలించారు. బాత్‌ రూమ్‌లో అచేతనంగా పడి ఉన్నట్లు గుర్తించారు. విషయం యాజమాన్యానికి తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడున్న ఆధారాల బట్టి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మణిదీప్‌కు బ్యాక్‌లాగ్‌ సబ్జెక్ట్స్‌ ఉండిపోయాయి. ఆ పరీక్షలు రాసేందుకు పండుగకు ఇంటికి వెళ్లలేదు. హాస్టల్‌లోనే ఉండిపోయాడు. ఓ పక్క ఏకాంతం, మరో పక్క మానసిక సంఘర్షణ కలిసి ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చు. కళాశాల యాజమాన్యం, పోలీసులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు ఆత్కూరి శిరీష, ఆత్కూరి రామారావు, బంధువులు ఆదివారం సాయంత్రానికి నెల్లిమర్ల చేరుకుని భోరున విలపించారు. తండ్రి రామారావు నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ఉన్న వికాస్‌ విద్యా సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా మణిదీప్‌ పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు గౌరీనంద్‌ బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు.

మిమ్స్‌లో విషాదం

మిమ్స్‌లో వైద్య విద్యార్థి సాయిమణిదీప్‌ ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తోటి విద్యార్థులు సైతం కన్నీరు మున్నీరయ్యారు. మణిదీప్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. నెల్లిమర్ల ఎస్‌ఐ బి.గణేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డాడీ, అమ్మా.. నన్ను క్షమించండి..

సాయి మణిదీప్‌ మృతదేహం వద్ద పోలీసులకు లభించిన సూసైడ్‌ నోట్‌లోని అంశాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ‘డాడీ, అమ్మా, నన్ను క్షమించండి’ అంటూ వేడుకున్నాడు. ‘గత పది సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా చాలా కష్టపెట్టాను. బాధ పెట్టాను. నా వల్లే ఇంట్లో సంతోషం, ప్రశాంతత లేదు. నా వల్లే మీ ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఎంత కష్టపడి చదువుదాం అన్నా చదవలేకపోతున్నా’ అంటూ ఆ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు బాధపడతానో తెలీదు, ఎందుకు సంతోషంగా ఉంటానో తెలీదు. నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు. ఆందోళన, కోపం, బాధ, భయం ఎందుకు ఎక్కువైపోతున్నాయో తెలీట్లేదు. లాస్ట్‌ 8-9 మాసాల నుంచి సూసైడ్‌ ఆలోచనలు తినేస్తున్నాయి. కాని ఎవరికీ చెప్పలేను. నా వల్ల తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఇంట్లో పరిస్థితుల వల్ల నాకు నేనే పిచ్చోడిలా అనిపిస్తున్నా. అమ్మా నా కోసం ఎంతో చేశారు.నేను మాత్రం మిమ్మల్ని బాధలు పెడుతూనే ఉన్నా. మీ నిద్ర, ఆరోగ్యం అన్నీ నా వల్లే పోతున్నాయి. బతకాలి అంటే భయమేస్తోందమ్మా. నా గురించి కాదు, ఇంకా ఎంత కాలం మిమ్మల్ని బాధ పెడతా అని, మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. నన్ను క్షమించండి డాడీ, అమ్మ...సారీరా తమ్ముడు‘‘ అంటూ ఆ లేఖలో రాశాడు. సాయి మణిదీప్‌ ఆత్మహత్య కళాశాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Updated Date - Jan 20 , 2025 | 12:27 AM