Filariasis ‘బోద’ను నిర్మూలిద్దాం
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:51 PM
Let’s Eradicate Filariasis పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి బోద వ్యాధిని నిర్మూలిద్దామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పెదపెంకి గ్రామంలో ఫైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురితో డీఈసీ, ఆల్బెండాజోల్ మాత్రలు మింగించారు.

బలిజిపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి బోద వ్యాధిని నిర్మూలిద్దామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పెదపెంకి గ్రామంలో ఫైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురితో డీఈసీ, ఆల్బెండాజోల్ మాత్రలు మింగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో 222 మంది వరకు ఫైలేరియా బాధితులు ఉన్నారని తెలిపారు. భవిష్యత్ తరాలకు బోద వ్యాధి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు చేయిస్తున్నామన్నారు.మండలంలోని 57 వేల మందికి డీఈసీ మాత్రలు అందించ నున్నట్లు చెప్పారు. గర్భిణులు పడగడపున ఈ మాత్రలు వేసుకోరాదన్నారు. బోద వ్యాధి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఇందుకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. తొలి మూడు రోజుల పాటు ఆరోగ్య కేంద్రాల పరిధిలో పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారని కలెక్టర్ తెలిపారు. 15 రోజుల తరువాత ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఎంఎల్‌పీఎస్‌లు ఇంటింటికీ వెళ్లి మాత్రలు మింగిస్తారని వెల్లడించారు. ఫైలేరియాకు కారణమయ్యే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లోని తడి, పొడి చెత్తలను వేరు చేసి సంపద కేంద్రాలకు పంపించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బోద వ్యాధి బాధితులతో మాట్లాడారు. అనంతరం పెదపెంకి జడ్పీఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మోదీ వర్చువల్ పరీక్షపే చర్చ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులతోపాటు కలెక్టర్ వీక్షించారు. ఆ తర్వాత విద్యార్థుల భవిత కార్డులను పరిశీలించి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. వారికి పౌష్టికాహారం అందించి రక్తహీనత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా అధికా శాంతిప్రియ, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, డీఈవో ఎన్.తిరుపతి నాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్‌పాల్, మలేరియా అధికారి వై.మణి, తహసీల్దార్ రత్నకుమారి, ఎంపీడీవో విజయలక్ష్మి, ప్రోగ్రామ్ అధికారులు , పీహెచ్‌సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
పార్వతీపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. మార్చి 17 నుంచి నుంచి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరుగుతాయన్నారు. మొత్తంగా 220 పాఠశాలల నుంచి 10,455 మంది విద్యార్థులు హాజరుకానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. రైల్వేగేట్లు ఉన్న గ్రామాల నుంచి విద్యార్థులు ముందుగా బయలుదేరేలా చూడాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. డీఈవో ఎన్.తిరుపతినాయుడు మాట్లాడుతూ.. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమిస్తున్నట్టు తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చి 3 నుంచి ఇంటర్ , 17 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయన్నారు. టెన్త్ పరీక్షలకు 560 మంది, ఇంటర్‌కు 426 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నట్టు చెప్పారు.